Hot Posts

6/recent/ticker-posts

ప్రధాన ప్రతిపక్షాన్ని మించిన రేంజ్ లో చంద్రబాబుపై షర్మిల విమర్శలు


ముఖ్యమంత్రి చంద్రబాబుపై టీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం వైసీపీని మించి షర్మిల చేస్తున్న విమర్శలు రాజకీయంగా చర్చకు దారితీస్తున్నాయ.

ANDHRAPRADESH:ముఖ్యమంత్రి చంద్రబాబుపై టీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం వైసీపీని మించి షర్మిల చేస్తున్న విమర్శలు రాజకీయంగా చర్చకు దారితీస్తున్నాయి. ఏపీలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన షర్మిల.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతికి వ్యూహంతోనే బనకచర్లను తెరపైకి తెచ్చారంటూ షర్మిల చేస్తున్న విమర్శలు కాకరేపుతున్నాయి. ప్రతిపక్షం వైసీపీకి అనుకూలమైన కాంట్రాక్టర్ల కోసమే బనకచర్ల ప్రాజెక్టును డిజైన్ చేశారని గతంలో కొందరు మేథావులు విమర్శలు గుప్పించారు. ఇక తాజాగా వారి మాటలను కోట్ చేస్తూనే వైసీపీతోపాటు సీఎం చంద్రబాబును టార్గెట్ చేశారు షర్మిల.

అందరూ వద్దంటున్న పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబుకి అంత ప్రేమెందుకో అర్థం కావట్లేదని షర్మిల మండిపడ్డారు. ‘‘ఇటు రాష్ట్ర మేధావులు వ్యతిరేకిస్తున్నారు. ఆ ప్రతిపాదన పనికిరాదని సీమ ప్రొఫెసర్లు చెబుతున్నారు. లక్ష కోట్లకు పైగా ఖర్చు తప్ప ప్రయోజనం లేదని ఇంజినీర్లు మొత్తుకుంటున్నారు. ఒక్క కాంట్రాక్టర్ కు తప్ప ఆంధ్రప్రదేశ్ కు ఏ మాత్రం ఉపయోగపడని గుదిబండ ప్రాజెక్టు కోసం రాష్ట్రాన్ని, పాలనను గాలికొదిలేసి ఢిల్లీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు’’ అంటూ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు షర్మిల.

బనకచర్ల లింక్ ప్రతిపాదన పోలవరం అసలు ప్రాజెక్టుకే ఎసరుపెడుతుందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెబుతున్నా, చంద్రబాబుకి ఎందుకు అర్ధం కావడం లేదని ప్రశ్నించారు. ‘‘మీ సొంత ప్రయోజనాల కోసం ఏకంగా పోలవరాన్నే ముంచేద్దామని ప్లాన్ చేస్తున్నారా? అందుకే ఎత్తు తగ్గించారా? ఏ నీళ్ల కోసం బనకచర్ల లింక్ ప్రతిపాదన చేశారని గోదావరి అథారిటీ అడిగిన దానికి మీ సమాధానం ఎక్కడ ? రాయలసీమకు హక్కుగా రావాల్సిన కృష్ణా, తుంగభద్ర నీళ్ల గురించి ఆలోచన చేయకుండా, ముక్కు ఎక్కడంటే తలచుట్టూ తిప్పినట్లుగా గోదావరి నుంచి తెస్తామనడం ఎవరిని మోసం చేయడానికి?’’ అంటూ పలు ప్రశ్నలు లేవనెత్తారు ఏపీసీసీ చీఫ్.

పెండింగ్ ప్రాజెక్టులకు సుమారు రూ.40 వేల కోట్లు వెచ్చిస్తే 50 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు, కోటి మంది జనాభాకు తాగునీరు అందుతుందని తెలిపారు. అయితేకూటమి ప్రభుతం ఈ విషయంలో చిత్తశుద్ధి చూపడం లేదని విమర్శించారు. పోలవరంతో సహా జలయజ్ఞం ప్రాజెక్టులు పూర్తి చేస్తే బనకచర్ల అవసరం లేదని తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని షర్మిల మండిపడ్డారు. ఇక బీజేపీ దత్తపుత్రుడు జగన్ మోహన్ రెడ్డి గారు పోలవరం గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుందన్నారు. 5 ఏళ్లలో పోలవరంలో తట్టెడు మట్టి తీశారా ? మహానేత ఆశయ సాధకుడే అయితే పోలవరంపై ఎందుకు నిర్లక్ష్యం చేశారు ? 2022లో పోలవరం నీటి నిల్వ సామర్ధ్యం 41.15 మీటర్ల కుదించిన పాపం ఆనాటి మీ ప్రభుత్వంది కాదా ? అంచనా వ్యయం రూ.55 వేల కోట్ల నుంచి రూ.37 వేల కోట్లకు తగ్గిస్తుంటే వేడుక చూసింది మీరు కాదా ? ప్రాజెక్ట్ ఎత్తు కుదింపు పాపం ముమ్మాటికి జగనుదే. బీజేపీకి అమ్ముడుపోయారని మండిపడ్డారు.