ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ పెట్టుబడికి లైన్ క్లియర్ అయ్యింది.. ఏకంగా రూ.70 వేల కోట్లతో పరిశ్రమ రాబోతోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కీలక ప్రకటన చేశారు. ఈ ఫ్యాక్టరీకి అవసరమైన అన్ని అనుమతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేశాయని.. త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
ఢిల్లీలో జరిగిన 6వ ఉక్కు సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఫ్యాక్టరీ శంకుస్థాపనపై క్లారిటీ ఇచ్చారు. దేశ ఆర్థికాభివృద్ధికి భారీ ఉక్కు పరిశ్రమ చాలా ముఖ్యమన్నారు శ్రీనివాసవర్మ. మన దేశ జీడీపీలో దీని వాటా 2% ఉందని.. దేశం అభివృద్ధి చెందడానికి, స్వయం సమృద్ధి సాధించడానికి ఇది చాలా అవసరమన్నారు. 2030 నాటికి దేశీయంగా 300 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలార్ మిత్తల్, నిప్పన్ స్టీల్స్ కలిసి భారీ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. దీని కోసం రూ.1.47 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. మొదటి దశలో రూ.70 వేల కోట్లతో 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయనున్నారు. ఈ మేరకు ముడి ఖనిజం సరఫరా కోసం ఎన్‌ఎండీసీతో ఒప్పందం కుదిరింది.
నక్కపల్లి మండలం రాజయ్యపేట దగ్గర 2,200 ఎకరాల భూమిని కర్మాగారం కోసం కేటాయించారు.. ప్లాంట్ నిర్మాణం మొదటి దశలో 20 వేల మందికి ఉపాధి లభిస్తుంది. రెండో దశలో ఉత్పత్తి సామర్థ్యాన్ని 10.5 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచనున్నారు. ఆర్సెలార్ మిత్తల్, నిప్పన్ స్టీల్స్ సంస్థలు 60:40 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టనున్నాయి.
ఈ స్టీల్ ప్లాంట్ మొదటి దశలో భాగంగా నాలుగేళ్లలో రూ.70వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రతిపాదనలు చేశారు. 2029 జనవారి నాటికి మొదటి దశ పనులు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట.. మొదటి దశలో 20 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెబుతున్నారు.
అయితే రెండో దశలో రూ.80వేల కోట్ల వరకు పనులు చేపట్టాలని భావిస్తున్నారట. రెండో దశ పనులు 2033 నాటికి పూర్తి చేయాలని.. మరో 35 వేల మందికి ఉపాధి దక్కుతుందని అంచనా వేస్తున్నారట. 2035 నాటికి 4వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు చేసే అవకాశం ఉంది.
మిత్తల్ సంస్థ రూ.11,198 కోట్లతో ఉక్కు కర్మాగారానికి అనుసంధానంగా కో-టెర్మినస్ క్యాప్టివ్ పోర్టును అభివృద్ధి చేయనుంది. ఈ పోర్టు నిర్మాణానికి రెండు దశల్లో పెట్టుబడులు పెట్టనున్నారు. దీని ద్వారా వేల మందికి ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు.. మొదటి దశలో రూ.5,816 కోట్లతో పోర్టు నిర్మాణం చేపట్టనున్నారు.. 5 బెర్తులు నిర్మించనున్నారు.
పోర్టు నిర్మాణానికి 150 ఎకరాల భూమిని కేటాయించాలని సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రెండో దశలో పోర్టు విస్తరణ కోసం రూ.5,382 కోట్లు ఖర్చు చేయనున్నారు. మరో 12 బెర్తులను నిర్మించాలని యోచిస్తున్నారు. దీని కోసం 170 ఎకరాల భూమిని కేటాయించాలని కోరారు. ఈ పరిశ్రమ రాకతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలు పెరుగతాయంటున్నారు.
Social Plugin