ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. గత నెలలో ఈ పథకం ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం... విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. మొత్తం రూ. 15 వేలలో తల్లుల ఖాతాల్లో రూ. 13 వేలు జమ చేసి, మిగిలిన రూ. 2 వేలు పాఠశాలల మెయింటనెన్స్ గ్రాంట్ కోసం కలెక్టర్ల ఆధ్వర్యంలోని అకౌంట్‌లో జమ చేశారు. తొలి విడతలో 67.27 లక్షల మంది విద్యార్థులకు పథకం అమలుచేశారు.
ప్రస్తుతం 2 నుంచి 10వ తరగతి వరకు, ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు మాత్రమే నిధులు విడుదల చేశామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. తదుపరి జాబితాలో ఈ విద్యా సంవత్సరం ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ ఫస్టియర్‌లో ప్రవేశాలు పొందిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులు జమ చేస్తామని కూడా వెల్లడించింది. ఇలా మొత్తంగా తుది అర్హుల జాబితాను సిద్దం చేసి... జూలై 5వ తేదీన తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో పేర్కొంది.
అయితే తాజాగా సమాచారం ప్రకారం... ఈ నెల 5వ తేదీన తల్లికి వందనం తదుపరి నిధులు జమ చేయడం లేదని తెలుస్తోంది. ఇప్పటికీ స్కూళ్లలో ఒకటో తరగతి అడ్మిషన్లు, ఇంటర్ కాలేజ్‌ల్లో ఫస్టియర్ అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండో విడత తల్లికి వందనం నగదును ఈ నెల 10వ తేదీన విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఇంకా అడ్మిషన్లు జరగడంతో ఎక్కువ మంది ఈ పథకం కింద లబ్ది పొందాలని, అర్హులు మిస్ అవ్వకూడదనేది ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు. మరోవైపు ఈ నెల 10వ తేదీన స్కూళ్లలో మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్ నిర్వహించనుండగా... అదే రోజు తల్లికి వందనం నిధులు విడుదల కానున్నాయని సమాచారం.
అయితే కొందరు మాత్రం తమకు అన్ని అర్హతలు ఉన్న తల్లికి వందనం డబ్బులు జమ కాలేదని వాపోయారు. ఈ క్రమంలోనే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకం అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. వివిధ కారణాలతో తల్లికి వందనం డబ్బులు పొందనివారు గ్రీవెన్స్ నమోదు చేసేందుకు అవకాశం కల్పించింది.
అయితే ఇప్పటికే వారి గ్రీవెన్స్ పరిశీలన కూడా పూర్తి అయినట్టుగా తెలుస్తోంది. ఇందులో అర్హులుగా తేలిన వారి ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం డబ్బులు జమ చేయనుంది.
ఇక, ఒక్కో విద్యార్థికి రూ. 13 వేల చొప్పున సాయం అందిస్తుండగా... ఇద్దరు పిల్లలు ఉన్న తల్లులకు రూ. 26 వేలు, ముగ్గురు పిల్లలు ఉన్న తల్లులకు రూ. 39 వేలు వారి అకౌంట్లలో జమ చేస్తున్నారు. తల్లికి వందనం స్టేటస్‌ను ఆన్‌లైన్ చెక్ చేసుకునేందుకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది.
Social Plugin