రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష - పేదల భూ సమస్యల పరిష్కారానికి సంబంధించి 10 అంశాలపై సుదీర్ఘంగా చర్చ
CM CHANDRABABU REVIEW ON REVENUE DEPARTMENT: క్యూ ఆర్ కోడ్ ఉండే పాస్ పుస్తకాలు తీసుకురావటం ద్వారా ప్రతి భూమికి సంబంధించిన సమగ్ర సమాచారం ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు.
ఆగస్టు 15 నుంచి పండుగ వాతావరణంలో ఉచితంగా కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేపట్టాలని నిర్ణయించారు. అమరావతి సచివాలయంలో రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పేదల భూ సమస్యల పరిష్కారానికి సంబంధించి 10 అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
రూ.10 లక్షల విలువైన వారసత్వంగా వచ్చే భూములకు సంబంధించిన సెక్షన్ సర్టిఫికెట్లు గ్రామ సచివాలయంలోనే రూ.100 చెల్లించి పొందే విధంగా వెసులుబాటు కల్పించాలని కీలకంగా నిర్ణయించారు. రూ.10 లక్షల పైబడిన భూములకు రూ.వెయ్యి చెల్లించి సెక్షన్ సర్టిఫికెట్ తీసుకునే చర్యలు చేపట్టాలన్నారు.
అక్టోబర్ నాటికి ప్రతి ఒక్కరికీ శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందించాలన్నారు. ఫ్రీహోల్డ్ భూములు సహా ఇతరత్రా మెజారిటీ రెవెన్యూ సమస్యలపై అక్టోబరు 2వ తేదీలోగా పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
పేదలకు ఇళ్ల స్థలాలపై రెవెన్యూ, మునిసిపల్, హౌసింగ్ మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. అభ్యంతరం లేని నివాస స్థలాలకు డిసెంబర్లోగా రెగ్యులరైజేషన్ పూర్తి చేయాలని నిర్దేశించారు.
ప్రోటోకాల్ విధుల నుంచి రెవెన్యూ సిబ్బందికి మినహాయించి, ఏ మంత్రి పర్యటనకు వెళితే ఆ శాఖ అధికారులే ప్రోటోకాల్లో వెళ్లేలా ఆదేశాలు జారీచేశారు.
పేదవాడికి నివాసయోగ్యమైన ఇళ్లు: పేదలకు లబ్ధి జరిగేలా ఫ్రీహోల్డ్ భూముల అంశం ఉండాలని తేల్చిచెప్పారు. ఫ్రీ హోల్డ్ భూములపై జీవోఎం సూచనల ఆధారంగా నిర్ణయం తీసుకుందామన్నారు.
ప్రైవేటు భూములు, ప్రభుత్వ భూములు ఇలా వివిధ రకాల భూములకు ఒక్కో రంగు కేటాయించి సులభతరంగా గుర్తించే ప్రక్రియ తీసుకొస్తామని సమీక్ష అనంతరం మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.
డిసెంబర్ 2027 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీ సర్వే 2.0 పూర్తి చేయనున్నట్లు తెలిపారు. భూ వివరాలు దృశ్యరూపంలో కనిపించేలా ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.
రాబోయే తరాలు రెవెన్యూ ఇబ్బందులు పడకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారని వివరించారు. శ్మశాన వాటికల నిర్మాణానికి రూ.137 కోట్ల విడుదలకు సీఎం ఆమోదం తెలిపారన్నారు. ప్రతీ పేదవాడికి నివాసయోగ్యమైన ఇళ్లు ఉండేలా చర్యలకు శ్రీకారం చుట్టామని చెప్పారు.
జర్నలిస్టులకు ఇళ్లు కేటాయింపు కోసం ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు సీఎం నిర్ణయం తీసుకున్నారన్న అనగాని, ఏడాది కాలంలో 4.63 లక్షల రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులు వస్తే, 3 లక్షల పైచిలుకు వాటిని పరిష్కరించినట్లు వెల్లడించారు.
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా వచ్చే ఫిర్యాదుల కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టి పరిష్కరిస్తామని తెలిపారు. గత పాలకులు రెవెన్యూ వ్యవస్థని ఆర్థిక వనరుగా చూసి భూములు అన్యాక్రాంతం చేశారని ఆరోపించారు.
తమ అనుచరులు బాగుపడేందుకు ప్రజల్ని భక్షించారే తప్ప రక్షించలేదని దుయ్యబట్టారు. సాంకేతికత సాయంతో ప్రతీ పేదవాడి భూ సమస్య పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రతీ 250 ఎకరాలను ఓ బ్లాక్‌గా తీసుకుని, రీ సర్వేను పారదర్శకంగా చేస్తున్నట్లు వివరించారు.
ఇల్లు, ఇంటి స్థలం లేని వాళ్లు ఉండకూడదు: రాష్ట్రంలో ఇల్లు, ఇంటి స్థలం లేని వాళ్లు ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. రెండేళ్లలో అందరికీ ఇంటి స్థలం, మరో రెండేళ్లలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు.
గత ప్రభుత్వంలో జగన్ సర్వే రాళ్లపై తన బొమ్మలు ముద్రించుకున్నాడని ముఖ్యమంత్రి మండిపడ్డారు. వీటికి సంబంధించి 77.9 లక్షల సర్వే రాళ్లపై పేర్లు, బొమ్మల తొలగింపు పూర్తి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆగస్టు నాటికి కొత్తగా ఇచ్చే ప్రతి పట్టాదారు పాసు పుస్తకంపై క్యూఆర్ కోడ్తో పాటు, ఆధార్ కార్డు ఆధారంగా ప్రతి భూ యజమాని తమ భూమి వివరాలు వ్యక్తి గతంగా తెలుసుకునే వెసులుబాటు కల్పించాలని సూచించారు.
ఆధార్ కార్డుతో సమగ్ర భూ వివరాలు రావాలని స్పష్టం చేశారు. రీ సర్వే పూర్తి అయ్యేవరకు గ్రామ వార్డు సచివాలయాల్లో సర్వేయర్లను యథావిధిగా కొనసాగించాలని ఆదేశించారు.
నాలా చట్టం రద్దుకు అవసరమైన కసరత్తు పూర్తి చేసి క్యాబినెట్ ముందుకు తీసుకురావాలని సీఎం స్పష్టం చేశారు.
రెవెన్యూ శాఖ తీసుకువస్తున్న కొత్త పోర్టల్ గురించి రివ్యూలో అధికారులు సీఎంకు వివరించారు. ఇతర శాఖలతో కూడా సమన్వయం చేసుకుని ఈ పోర్టల్‌ను సమగ్రంగా తీసుకురావాలని సీఎం ఆదేశించారు. దీనికి ఆలోచించి మంచి పేరు పెట్టాలని అధికారులను సీఎం సూచించారు
Social Plugin