Hot Posts

6/recent/ticker-posts

అన్నదాత సుఖీభవ వేళ ఇవన్నీ- అధికారులకు కీలక ఆదేశాలు


ఏపీలో పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధుల విడుదలకు రంగం సిద్దమైంది. ప్రధాని మోడీ తమిళనాడు లోని కోయంబత్తూరు నుంచి పీఎం కిసాన్ నిధుల్ని రైతుల ఖాతాలకు జమ చేసేందుకు వీలుగా విడుదల చేస్తుండగా.. అనంతరం సీఎం చంద్రబాబు ఏపీలో రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకం నిధుల్ని విడుదల చేస్తారు. మొత్తంగా 7 వేల రూపాయల నిధులు రెండో విడత పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.

ఈ నేపథ్యంలో అధికారులకు రాష్ట్ర వ్యవసాయ కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం, పెండ్లిమర్రి మండలం, చినదాసరిపల్లి గ్రామంలో సీఎం చంద్రబాబు మధ్యాహ్నం ఈ నిధులు విడుదల చేస్తారు. అదే సమయంలో రాష్ట్రంలోని అన్ని నియోజక కేంద్రాలలో ,రైతు సేవా కేంద్రాలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో జిల్లా ఇంచార్జి మంత్రులు ,జిల్లా మంత్రులు ,పార్లమెంట్ సభ్యులు ,శాసన సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో కేంద్రం 2 వేలు రాష్ట్రం 5 వేలు చొప్పున మొత్తంగా 7 వేల రూపాయలను 46.86 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.3135 కోట్ల రూపాయలను జమ చేస్తుందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. ఈ కేటాయింపులలో 70 శాతం పైగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నందున విషయాన్ని తప్పనిసరిగా రైతులకు చెప్పాలని అధికారుల్ని ఆదేశించారు. అలాగే కేవలం నిధుల విడుదల మాత్రమే కాకుండా ప్రాంతాలకు అనుగుణంగా ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సాయాన్ని వారికి తెలియచేయాలన్నారు.

చిత్తూరు జిల్లా లో తోటాపురి మామిడి ,ప్రకాశం జిల్లాలో బర్లీ పొగాకు, కర్నూలు జిల్లా లో ఉల్లి ,వరి పండించే ప్రాంతాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ,మార్కెట్ సౌకర్యం పెంపు ,భూసార పరీక్షలు,మార్కెట్ డిమాండ్ వున్న పంటల సాగు తదితర అంశాలపై రైతులకు మరింత అవగాహన పెంచేలా గ్రామస్థాయి రైతుసేవా కేంద్ర సిబ్బంది నుండి జిల్లా స్థాయి వ్యవసాయ అధికారుల వరకు గట్టి కృషి చేయాలని ఆదేశించారు. 

అలాగే నియోజక ,మండల , గ్రామ స్థాయి వరకు లబ్ధి దారుల వివరాలు , అందుతున్న నగదు,అర్హతలు ,మరణించిన వారి వివరాలు, పని చేయని ఖాతాలు, బ్యాంకులు తిరస్కరించినవి , ఎన్పీసీఐ కాని ఖాతాలు వంటి వివరాలు అందుబాటులో ఉంచాలన్నారు.

అలాగే నియోజక వర్గ స్థాయిలో జరిగే కార్యక్రమంలో జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య ,అందిస్తున్న మొత్తం తెలియచేస్తూ డమ్మీ చెక్ లు తయారు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం జరిగిన తరువాత వారం రోజులపాటు గ్రామ స్థాయి రైతు సేవాకేంద్రం సిబ్బంది వారి పరిధి లోని ప్రతి రైతును ఔట్ రీచ్ కార్యక్రమం ద్వారా సంప్రదించి అన్నదాత సుఖీభవ డబ్బు జమపై ఆరా తీయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న వివిధ సౌకర్యాలను తెలియచేయాలన్నారు.

చివరిగా కోయంబత్తూరు నుండి ప్రధానమంత్రి ప్రారంభిస్తున్న పీఎం కిసాన్ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని,సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభవ కార్యక్రమం ప్రారంభోత్సవాన్ని లైవ్ ద్వారా అన్ని నియోజక వర్గ కేంద్రాలలో ,రైతు సేవకేంద్రాలలో, కేవీకే కేంద్రాలలో, వ్యవసాయ పరిశోధన స్థానాలలో ప్రసారం చేయాలని ఆదేశించారు.