Hot Posts

6/recent/ticker-posts

Land Registration: సామాన్యులకి గుడ్ న్యూస్.. కేవలం రూ.100 చెల్లిస్తే భూముల రిజిస్ట్రేషన్‌.


 Land Registration: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వారసత్వ భూముల విషయంలో కొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌ గ్రామ లేదా వార్డు సచివాలయాల్లోనే చేయొచ్చు.

రూ.100తో రిజిస్ట్రేషన్‌ పూర్తిచేసే అవకాశం:

వారసత్వ భూముల విలువ రూ.10 లక్షల లోపు ఉంటే కేవలం రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. విలువ ఎక్కువైతే రూ.1,000 స్టాంప్‌ డ్యూటీ కింద వసూలు చేస్తారు. 

ఆస్తి యజమాని మరణించిన తరువాత వారసులు పొందే భూములకే ఈ సౌకర్యం వర్తిస్తుంది. మిగిలిన భూముల విషయంలో ఇప్పటిలాగే సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ కొనసాగుతుంది.

రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం:

రెవెన్యూ వ్యవస్థలో విస్తృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

వారసత్వ ధ్రువీకరణ లేకపోవడం వల్ల గ్రామాల్లో ఎన్నో వివాదాలు వస్తుండటాన్ని ప్రభుత్వం గుర్తించింది. కుటుంబ కలహాలు, రిజిస్ట్రేషన్‌ జాప్యాలు వంటి ఇబ్బందుల నివారణకే ఈ సులభతర విధానం రూపొందించారు.

సీఎం చంద్రబాబు సమీక్షలో కీలక నిర్ణయం:

ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా, అక్టోబర్ 2లోగా రాష్ట్రంలోని రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 

రిజిస్ట్రేషన్‌ వ్యవహారాన్ని మరింత వేగవంతం చేసేందుకు వారసత్వ ధ్రువీకరణ పత్రాలను తక్కువ ఫీజుతో అందించాలనే నిర్ణయం తీసుకున్నారు.

దరఖాస్తులు భారీగా - ఫిర్యాదులే ఆధారం:

తల్లిదండ్రులు మరణించిన తర్వాత వారసులు తహసీల్దార్‌కు దరఖాస్తులు ఇచ్చినా, మ్యుటేషన్‌లు సకాలంలో జరగడం లేదన్న ఫిర్యాదులు ప్రభుత్వానికి అందుతున్నాయి. గతేడాది 55 వేల దరఖాస్తులపై ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయి. 

అంతేకాక, కొన్ని సందర్భాల్లో రిజిస్ట్రేషన్ అవసరం లేదని భావించి భూమిని పాత యజమానుల పేర్లతోనే ఉంచుతున్నారు. దీని వల్ల రికార్డుల్లో గందరగోళాలు వస్తున్నాయి.

ముఖ్య సమాచారం: వారసత్వ ధ్రువీకరణ సర్టిఫికెట్‌ గురించిగ్రామాల్లో వారసత్వ వివాదాలు పెరగటంతో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. 

ధ్రువీకరణ పత్రం (సక్సెషన్‌ సర్టిఫికెట్‌) జారీ ప్రక్రియను సులభతరం చేశారు. రూ.10 లక్షల లోపు భూములకు రూ.100, అధిక విలువ కలిగిన భూములకు రూ.1,000 ఫీజు. ఈ సర్టిఫికెట్లు స్థానిక సచివాలయాల్లోనే జారీ అవుతాయి.

రెవెన్యూ శాఖ అంచనా ప్రకారం, రిజిస్ట్రేషన్లు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వచ్చిన 1.85 లక్షల దరఖాస్తుల్లో కేవలం 687 మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం 4.63 లక్షల గ్రీవెన్సుల్లో 3.99 లక్షల మేరకు పరిష్కరించామని మంత్రి అనగాని తెలిపారు.

ఇక వ్యవహారం మరింత ఈజీగా...

గ్రామ/వార్డు సచివాలయాల్లో మరణ ధ్రువీకరణ, కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రాలు ఇప్పటికే జారీ అవుతున్నాయి. 

యజమాని మరణించిన తర్వాత వారసులు తమ మధ్య ఓకే అయితే, లిఖితపూర్వకంగా అంగీకారం తెలపడంతో పాటు డిజిటల్ అసిస్టెంట్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చు.

ఈ ప్రక్రియ చాలా సులభంగా పూర్తవుతుంది. రిజిస్ట్రేషన్‌ అయిన వెంటనే భూమి వివరాలు రికార్డుల్లోకి చేరతాయి (మ్యుటేషన్‌ ఆటోమేటిక్‌గా), ఈ-పాస్‌బుక్‌ కూడా జారీ అవుతుంది. వారసుల నుంచి ఈ-కేవైసీ తీసుకుంటారు.

సీఎం ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తుంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలు కూడా ఈ ప్రక్రియకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటాయి. రెండు నుంచి మూడు నెలల్లో ఇది అమల్లోకి వచ్చే అవకాశముంది. 

గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న అనవసర నిర్ణయాలతో వచ్చిన గందరగోళాన్ని నివారించేందుకే ఇది. ఇకపై స్థానిక సబ్‌రిజిస్ట్రార్ పర్యవేక్షణలోనే వారసత్వ భూములకు మాత్రమే రిజిస్ట్రేషన్‌లు జరుగుతాయి. డిజిటల్ అసిస్టెంట్లకు ఈ కొత్త విధానంపై మరల శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.