ఏపీలో కూటమి ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో మూడేళ్లలో కోటి మొక్కలు నాటాలనే లక్ష్యంతో పాఠశాలల విద్యార్థులను భాగస్వామ్యం చేసింది.
ANDHRAPRADESH:ఏపీలో కూటమి ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో మూడేళ్లలో కోటి మొక్కలు నాటాలనే లక్ష్యంతో పాఠశాలల విద్యార్థులను భాగస్వామ్యం చేసింది. గురువారం నిర్వహించిన మెగా పేటీఎంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థికి ఒక మొక్కను పంపిణీ చేయనుంది. ఆ మొక్కతోపాటు గ్రీన్ పాసుపోర్టు ఒకటి అందజేసింది. ఈ పాసుపోర్టులో విద్యార్థి వివరాలతోపాటు ఆ విద్యార్థికి అందజేసిన మొక్క పేరు, అది నాటిన ప్రదేశం, మూడు నెలలకు ఒకసారి దాని పురోగతిని నమోదు చేయాలని ఆదేశించింది.
విద్యార్థులకు సామాజిక బాధ్యత అలవరడంతోపాటు పచ్చదనం పెరిగేలా ఈ పథకానికి రూపకల్పన చేసింది. మెగా పేటీఎం కార్యక్రమం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమైన ఉపాధ్యాయులు మొక్కలు పెంపకంపైనా వారితో చర్చించారు. 4వ తరగతి నుంచి ఆపై తరగతుల వారికి ఈ బాధ్యతను అప్పగించింది.
విద్యార్థులు మొక్కలు పెంచడం ద్వారా ఐదు మార్కులు పొందనున్నారని ప్రభుత్వం తెలిపింది. విద్యార్థులు మొక్కలను ఎలా పెంచుతున్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా గ్రీన్ కార్డులను తయారు చేయించిన ప్రభుత్వం వాటిపై ఉపాధ్యాయులు ఏటా రెండు సార్లు సంతకాలు చేయాలని సూచించింది. ‘మొక్క పెరుగుదలతో నా ప్రయాణం’ అనే క్యాప్షన్ తో తయారు చేసిన గ్రీన్ కార్డులు విద్యార్థులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ‘అమ్మ పేరుతో ఒక మొక్క’ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టినట్లు చెబుతున్నారు.
Social Plugin