ANDHRAPRADESH:ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పుష్ప సినిమాలోని రప్పా రప్పా డైలాగ్ కాక పుట్టిస్తున్న విషయం తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీశ్రేణులు ఏర్పాటుచేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలలో రప్పా రప్పా డైలాగు వాడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వైఎస్ జగన్ నోటినుండి కూడా రప్పా రప్పా డైలాగ్ రావడం, దానికి కౌంటర్ గా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఆ డైలాగ్ పైన మాట్లాడడం తెలిసిందే.
రప్పా రప్పా డైలాగులు గుర్తుచేసి షాకింగ్ వ్యాఖ్యలు చేసిన పేర్ని నాని అయితే తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని మరో మరో రప్పా రప్పా డైలాగులు గుర్తుచేసి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. కృష్ణాజిల్లాలో బాబు షూరిటీ మోసం కార్యక్రమాలలో పాల్గొంటున్న మాజీ మంత్రి పేర్ని నాని చంద్రబాబును, కూటమి ప్రభుత్వాన్ని పదేపదే టార్గెట్ చేస్తున్నారు. పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాలలో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
లోకేష్ లా మీరు చెడిపోయారా?
ఇక ఈ మీటింగ్ లలో పేర్ని నాని వైసీపీ శ్రేణులను మంత్రి నారా లోకేష్ మాదిరి మీరు కూడా చెడిపోయారా అంటూ ప్రశ్నించారు. లోకేష్ రెడ్ బుక్ అంటే మీరు రప్పా రప్పా అంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఏదైనా చేయాలంటే చీకట్లో కన్ను కొడితే అయిపోవాలి తప్ప రప్పా రప్పా కాదని ఆయన పేర్కొన్నారు. అసలు రప్పా రప్పా మెయిన్ కాదని పేర్కొన్న ఆయన చీకట్లోనే అనుకున్న పని జరిగిపోవాలి అన్నారు.
ముల్లుని ముల్లుతోనే తియ్యాలి
రప్పా రప్పా అని వేలం వెర్రిగా ఎవరు మాట్లాడొద్దని కార్యకర్తలకు చెప్పారు. ముల్లును ముల్లుతోనే తీయాలని చెప్పిన పేర్ని నాని నోటి మాటలతో కాదు సమాధానం ఘాటుగా చెప్పాలన్నారు. ప్రజల మనసులో మన్నన పొందే విధంగా పనిచేయాలని సూచించారు. రప్పా రప్పా అని మాట్లాడితే ప్రజలు మన్నించరని తెలిపారు.
లోకేష్ రెడ్ బుక్ చంద్రబాబుకు, పవన్ కు ఉరితాడు అవుతుంది
అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు చేసిన వారి సంగతి చూడాలని అప్పటివరకు ఈ మాటలు అవసరం లేదని ఆయన సూచించారు. లోకేష్ రెడ్ బుక్ చివరికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి ఉరితాడు అవుతుందంటూ మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఏపీలో వైసీపీ శ్రేణుల రప్పా రప్పా వ్యాఖ్యల నేపధ్యంలో పని చీకట్లో జరిగిపోవాలని చెప్పటం అందరినీ షాక్ కు గురి చేసింది.
Social Plugin