ANDHRAPRADESH:శ్రీకాళహస్తికి చెందిన కారు డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసు మిస్టరీ వీడింది. ఇటీవలే చెన్నై సమీపంలో రాయుడి మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో అయిదుమందిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ ఛార్జి వినుత కోటా, ఆమె భర్త చంద్రబాబుతో పాటుగా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
యువకుడి హత్య గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. వినుత, ఆమె భర్త చంద్రబాబుతో పాటు నిందితులను శ్రీకాళహస్తి తీసుకొచ్చి పోలీసులు అన్నీ కోణాల్లోనూ విచారణ జరుపుతున్నట్లు సమాచారం. శ్రీనివాసులు అలియాస్ రాయుడు గతంలో వినుత వద్ద కారు డ్రైవర్ గా, పీఏగా కూడా పనిచేశాడు. రెండు వారాల కిందటే అతన్ని ఆమె విధుల నుంచి తొలగించినట్లుగా సమాచారం.
2019 నాటి ఎన్నికల్లో వినూత శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు గానీ విజయం సాధించలేకపోయారు. కనీసం పోటీ ఇవ్వలేకపోయారు. నాటి ఎన్నికల్లో ఆమెకు పోల్ అయిన ఓట్లు 5,274 మాత్రమే. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఘన విజయం సాధించింది.
38 వేలకు పైగా ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి.. టీడీపీకి చెందిన బొజ్జల సుధీర్ రెడ్డిని ఓడించారు. 2024 ఎన్నికల్లో వినూత పోటీకి దూరం అయ్యారు. పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయించింది జనసేన. టీడీపీ అభ్యర్థిగా బొజ్జల సుధీర్ రెడ్డి ఇక్కడ విజయం సాధించారు.
ఎన్నికల్లో పోటీకి దూరమైనప్పటికీ వినూత రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటోన్నారు. తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వ కార్యకలాపాల్లో తరచూ పాల్గొంటోన్నారు. ఈ పరిస్థితుల్లో కారు డ్రైవర్ హత్య కేసులో ఆమె అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది.
చెన్నై మింట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూవం నదిలో మూడు రోజుల క్రితం ఓ గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. మృతుడి చేతి మీద జనసేన సింబల్‌తో పాటు వినుత పేరు ఉండడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో ఈ నెల 8వ తేదీన రాయడిని హత్య చేసి నదీలో పడేసినట్లుగా తెలుస్తోంది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
రాయుడు అలియాస్ శ్రీనివాసులు తమకు ద్రోహం చేసినందున అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు కిందటి నెల 21వ తేదీన కోట వినూత వెల్లడించారు. అతనికి, తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఇప్పుడు రాయుడు హత్యకు గురి కావడం, చెన్నై సమీపంలో అతని మృతదేశం లభించడం సంచలనంగా మారింది.
Social Plugin