ఏలూరు జిల్లాలో నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి ముహూర్తం కుదరలేదు. ప్రభుత్వ రాజముద్రతో ముద్రించినవి జిల్లా కేంద్రానికి వచ్చి మూడు నెలలు కావొస్తోంది. జిల్లాలో 80614 పట్టాదార్ పుస్తకాలు సిద్ధం చేశారు. అయితే ఇంకా ఆర్డీవోల నుంచే మండల కేంద్రాలకు చేరలేదని చెబుతున్నారు.
పాస్ పుస్తకాలు ఎప్పుడిస్తారంటూ కాళ్లరిగేలా రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. భూములు అమ్ము కోవాలన్నా లేదా కొనుగోలు చేయడంతో పాటు పంట రుణాలు పొందేందుకు పట్టాదారు పాస్ పుస్తకం కలిగి ఉండడం తప్పనిసరి. వైసీపీ ప్రభుత్వంలో జగనన్న భూ హక్కు పత్రంగా ఆయన చిత్రపటంతో ముద్రించి పంపిణీ చేశారు.
వీటి స్థానంలో 2024 ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, వాటి స్థానంలో కొత్తవి సిద్ధం చేసి అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నాటికి ఇస్తామని చెప్పినా ఆపై ఎటువంటి కదలిక లేకపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు.
పెండింగ్ ఎందుకో
రైతులకు ప్రభుత్వ రాజమద్రతో భూ యాజమాన్య హక్కు పత్రాలను (పట్టాదారు పాస్ పుస్తకాలు) జారీ చేయడానికి ప్రభుత్వం చేపట్టిన కసరత్తులు పూర్తయ్యాయి. ప్రభుత్వం పాస్ పుస్తకాలను ఎంతో ఆకర్షణీయంగా తయారు చేసింది. జిల్లాలో మూడో విడత భూముల రీ సర్వేను ప్రభుత్వం చేపట్టింది.
రెండు విడతల్లో చేపట్టిన సర్వేలు సమగ్రంగా పూర్తయ్యాయి. మార్పులు, చేర్పులు వెబ్ ల్యాండ్ డేటా ఆధారంగా కొత్త పట్టాదారు పుస్తకాలను ముద్రింప చేసింది. ఏలూరు డివిజన్‌లో 36,267.. జంగారెడ్డి గూడెం డివిజన్‌లో 42,674, సూజివీడు డివిజన్లో 1,473 కలిపి మొత్తం 80,614 పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తప్పులు సరిదిద్దుతున్నారా
కొత్త పుస్తకాల్లోనూ తప్పులు పునరావృతమై ఉండి ఉండవచ్చునని ప్రచారం సాగుతోంది. తప్పులు లేకుండా.. రైతులు ఇబ్బంది పడకుండా మార్పులు చేస్తున్నారా? అంటే యంత్రాంగం ఆవుననే సమాధానం చెబుతోంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వీటిని రెండు విడతలుగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా.. తేదీలు ఖరారు చేయకపోవడంతోనే వీటిని పంపిణీ చేయలేదని కలెక్టరేట్ వర్గాలు చెబుతున్నాయి.

Social Plugin