Hot Posts

6/recent/ticker-posts

సైబర్ నేరాలు చేయాలంటే వణికేలా....! రఘురామ కీలక ప్రకటన..!


ANDHRAPRADESH:ఏపీలో సైబర్ నేరాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చట్టాలు వీటిని నియంత్రించలేకపోతున్నాయి. ప్రభుత్వాలకు ఎంత చిత్త శుద్ధి ఉన్నా సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త రూపాల్లో విరుచుకుపడుతున్నారు. జనం డబ్బులు కొల్లగొడుతున్నారు. దీంతో సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపేందుకు వీలుగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

సైబర్ క్రైమ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు వీలుగా ప్రస్తుతం ఉన్న చట్టానికి మరింత పదును పెట్టే విధంగా వచ్చే శాసన సభా సమావేశాల్లో చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు అసెంబ్లీ పిటిషన్ల కమిటీ ఛైర్మన్ రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. పటిష్టమైన చట్ట రూపకల్పనకు హోం, ఐటీ శాఖల కార్యదర్శులతో జరిగిన శాసనసభ పిటిషన్ల కమిటీ సమావేశంలో దీనిపై సమగ్రంగా చర్చించినట్లు రఘురామ తెలిపారు. కమిటీ సభ్యులు కొణతాల రామకృష్ణ, పల్లా శ్రీనివాసరావు, పి విష్ణు కుమార్ రాజు, గురజాల జగన్మోహన్ తో కలసి ఆయన ఈ సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలో జరుగుతున్న సైబర్ నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే పలు ఆదేశాలు జారి చేశారని, ఈ అంశంపై అసెంబ్లీ పిటిషన్ల కమిటీ కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు రఘురామ తెలిపారు. బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ వల్ల రాష్ట్రంలోని ఎంతో మంది అమాయకులు మోసపోతున్నారని, వీటికి సంబంధించి కేవలం 4 శాతం కేసులు మాత్రమే నమోదు అవుతున్నాయన్నాయని తెలిపారు. మొత్తం రూ.960 కోట్లు మేర మోసం జరిగిందని, ఇందులో రూ.300 కోట్ల వరకూ రికవరీ చేసినట్లు గతేడాది నివేదికలు చెప్తున్నాయన్నారు.

ఈ లెక్కన ఏడాదికి దాదాపు రూ.30 వేల కోట్ల వరకూ సైబర్ నేరాలు జరుగుతున్నట్లు రఘురామ పేర్కొన్నారు. మోస పూరిత యాప్స్ ను రూపొందించే వారిపైనా, సిస్టమ్స్ లో వాటిని లోడ్ చేసేవారిపై కేసులు పెట్టే అవకాశం ప్రస్తుతం చట్ట ప్రకారం లేదని, అందుకే దాన్ని సవరించి కొత్త చట్టం తెస్తామని తెలిపారు. దీనిపై సమగ్రమైన నివేదికను తమ కమిటీ త్వరలో స్పీకర్ కు అందిస్తుందన్నారు.