కాగా, ఇప్పుడు ఈ రేషన్ దుకాణాలను మినీ మాల్స్ గా మార్చేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అదే సమయంలో ఇక రోజంతా సరఫరాల చేసేలా కొత్త విధానం అమల్లోకి తీసుకొస్తోంది. అందులో భాగంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో పైలెట్ ప్రాజెక్టు గా అమలు చేయాలని నిర్ణయించింది.
ఏపీ ప్రభుత్వం రేషన్ సరఫరా వ్యవస్థలో కొత్త మార్పులకు సిద్దమైంది. ఇప్పటికే రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులను తీసుకొచ్చారు. కాగా, ఇప్పటి వరకు నిర్దేశిత సమయాలకే పరిమితమైన రేషన్ సరఫరా ఇక రోజంతా అమలు చేసేందుకు సిద్దమైంది.
అదే సమయంలో చౌక ధర దుకాణా లను మినీమాల్స్‌గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందు కోసం తిరుపతి, గుంటూరు, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, విజయవాడ నగరాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసారు. ప్రస్తుతం ఏపీలోని రేషన్ దుకాణాల్లో ప్రతి నెలా 1-15 వరకు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు బియ్యంతో పాటుగా ఇతర నిత్యావసరాలు ఇస్తున్నారు.
ఈ విధానంలో కొందరు డీలర్లు సరిగా దుకాణాలు నిర్వహించట లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఒకవేళ తీసినా సమయపాలన పాటించకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.
దీంతో, వీటికి చెక్ పెడుతూ ప్రభుత్వం కొత్త నిర్ణయాల అమలుకు సిద్దమైంది. మినీమాల్స్ విధానంలో రోజంతా దుకాణాలు తెరిచి ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. మినీమాల్స్‌లో అన్ని నిత్యావసరాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
జాతీయ వ్యవసాయ కో-ఆపరేటివ్ సొసైటీ, గిరిజన కార్పొరేషన్ నుంచి చౌకధర దుకాణాలకు ఆయా నిత్యావసరాలను సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే.. ఈ వస్తువులను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా లేక డీలర్లే కొనుగోలు చేయాలా అనేది తెలియాల్సి ఉంది. అదే విధంగా సదరు నిత్యావసరాలపై లబ్ధిదారులకు రాయితీ ఉంటుందా లేదా అన్న అంశాలపై కుడా స్పష్టత రావాల్సి ఉంది.
పైలట్ ప్రాజెక్టులో భాగంగా రేషన్ దుకాణాల్లో రేషన్ బియ్యంతో పాటు ఈ నిత్యావసరాలన్నీ పెట్టేందుకు అనువుగా ఒక్కో నగరంలో 15 చొప్పున మొత్తం 75 దుకాణాలను అధికారులు ఎంపిక చేస్తున్నారు. ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చిన తరువాత అధికారికంగా ప్రకటించనున్నారు.
Social Plugin