INDAIA, ANDRAPRADESH: సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య గురువారం పార్లమెంటు ఆవరణలో సందడి చేశారు. తన నియోజకవర్గ సమస్యలపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ఢిల్లీ వచ్చిన బాలయ్య టీడీపీ ఎంపీలతో భేటీ అయ్యారు. ఇదే సమయంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పార్లమెంటుకు సైకిల్ పై వస్తున్నారని తెలుసుకున్న బాలయ్య.. తాను ఆ సైకిల్ తొక్కేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినీ నటుడుగా బాలయ్య సైకిల్ తొక్కడం కొత్త కాకపోయినప్పటికీ.. చాలా కాలం తర్వాత ఆయన ఇలా సైకిల్ సవారీకి సిద్ధపడటం మాత్రం ఆసక్తి రేపింది.
మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన సైకిల్‌పై మోజుపడిన బాలయ్య సీటుపై ఎక్కేందుకు కాస్త కష్టపడ్డారు. సీటు ఎత్తుగా ఉండటంతో దానిపై కూర్చొవడం కుదరకపోవడంతో వెనుక ఉన్న క్యారేజీపై బాలయ్య కాసేపు కూర్చొని సరదా తీర్చుకున్నారు. ఈ బిజీ యుగంలో కూడా రోజూ సైకిల్ పై పార్లమెంటుకు వస్తున్న విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడును బాలయ్య అభినందించారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని కలిసిన బాలయ్య తన నియోజకవర్గం హిందూపురం సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, మనోహర్ లాల్ ఖట్టర్, హర్దీప్ సింగ్ పూరి, మన్ సుఖ్ మాండవీయలను కలిసేందుకు అపాయింట్‌మెంట్ తీసుకున్నారు.
ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ తన నియోజకవర్గ సమస్యలపై బాలయ్య ఢిల్లీకి రావడం చర్చకు దారితీస్తోంది. ఇటీవల కాలంలో అఖండ-2 సినిమా చిత్రీకరణలో భాగంగా బాలయ్య టీడీపీ కార్యక్రమాలకు కూడా పెద్దగా హాజరుకావడం లేదు. గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ ఆయన కనిపించలేదని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. కానీ, ఇదే సమయంలో తన నియోజకవర్గానికి అడపాదడపా వెళ్లి వస్తున్న బాలయ్య.. కేంద్ర స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలపై నేరుగా కేంద్ర మంత్రులను కలవాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
Social Plugin