Hot Posts

6/recent/ticker-posts

ఏపీలోని ఆ మూడు జిల్లాలో భూసమీకరణ.. ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్..


ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ రీజియన్ అభివృద్ధి కోసం భూసమీకరణ చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాలలో 1941 ఎకరాల భూమిని సమీకరించాలని నిర్ణయించింది. 

ఈ మేరకు ఏపీ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నంలోని పద్మనాభం, ఆనందాపురం మండలాలు, విజయనగరంలోని డెంకాడ, భోగాపురం మండలాలు, అనకాపల్లి జిల్లాలోని సబ్బవరం, అనకాపల్లి మండలాలలో భూమిని సమీకరించనున్నారు.

సాగరతీరం విశాఖపట్నం అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తుంటారు. ఈ క్రమంలోనే విశాఖ కేంద్రంగా పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే విశాఖలో టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ఐటీ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. 

అలాగే లులు గ్రూప్ కూడా వైజాగ్‌లో పెట్టుబడులు పెట్టనుంది. ఇందుకు సంబంధించి ఇటీవల భూమిని కూడా కేటాయించారు. అలాగే విశాఖ కేంద్రంగా రూ.20000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు నాలుగు సంస్థలు చేసిన ప్రతిపాదనలకు ఏపీ ప్రభుత్వం ఇటీవల ఆమోదం కూడా తెలిపింది. ఈ క్రమంలోనే విశాఖపట్నం రీజియన్ అభివృద్ధిపై ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది.

విశాఖ రీజియన్ అభివృద్ధి కోసం ల్యాండ్ పూలింగ్ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. విశాఖపట్నం, విజయనగరం , అనకాపల్లి జిల్లాల్లో భూ సమీకరణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ మూడు జిల్లాల పరిధిలో 1941.19 ఎకరాల భూమిని సమీకరించేందుకు అనుమతులు ఇచ్చింది. 

విశాఖపట్నం జిల్లాలోని ఆనందాపురం, పద్మనాభం మండలాల్లో 1132.09 ఎకరాల భూమిని సమీకరించనున్నారు. అలాగే విజయనగరం జిల్లాలోని డెంకాడ, భోగాపురం మండలాల్లో 25.41 ఎకరాల భూమిని.. అనకాపల్లి జిల్లాలోని సబ్బవరం మండలం, అనకాపల్లి మండలాల్లో 783.69 ఎకరాలు చొప్పును భూమిని సమీకరించనుంది. 

విజయనగరం, భీమునిపట్నం, అనకాపల్లి ఆర్డీవోలకు భూసమీకరణ బాధ్యతలు అప్పగించారు. భూసమీకరణ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని విశాఖ కమిషనర్‌ను ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశించారు.

మరోవైపు ఏపీ రాజధాని అమరావతిలోనూ భూసమీకరణ చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాజధాని భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రెండోవిడత భూసమీకరణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం భావించింది. అయితే తొలివిడత భూసమీకరణలో అక్కడక్కడా ఎదురైన లోటుపాట్లు, ఇతర సమస్యలను పరిష్కరించుకుని. 

ఆ తర్వాత అమరావతిలో రెండో విడత భూసమీకరణ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీ పురపాలకశాఖ మంత్రి నారాయణ కూడా ఇదే విషయాన్ని ఇటీవల వెల్లడించారు. అమరావతి రెండో దశ భూసమీకరణ ఆగలేదని.. తొలివిడతలో అక్కడక్కడా ఉన్న సమస్యలను పరిష్కరించుకున్న అనంతరం ముందుకు వెళ్తామని నారాయణ ఇటీవల తెలిపారు.