Hot Posts

6/recent/ticker-posts

Minister Nara Lokesh: సింగపూర్‌లో మంత్రి లోకేష్ బిజీ బిజీ.. పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలు


ఏపీకి పెట్టుబడులపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సింగపూర్‌లో పారిశ్రామిక వేత్తలతో వరుస సమావేశాల్లో పాల్గొంటున్నారు. వరుస భేటీలతో మంత్రి లోకేష్ మంగళవారం బిజీ బిజీగా ఉన్నారు. క్యారియర్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అరుణ్ భాటియాతో మంత్రి నారా లోకేష్ సింగపూర్‌లోని షాంగ్రీలా హోటల్‌లో సమావేశం అయ్యారు

అమరావతి: ఏపీకి పెట్టుబడులపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సింగపూర్‌లో పారిశ్రామిక వేత్తలతో వరుస సమావేశాల్లో పాల్గొంటున్నారు. వరుస భేటీలతో మంత్రి లోకేష్ ఇవాళ(మంగళవారం జులై 29) బిజీ బిజీగా ఉన్నారు. క్యారియర్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అరుణ్ భాటియాతో మంత్రి నారా లోకేష్ సింగపూర్‌లోని షాంగ్రీలా హోటల్‌లో సమావేశం అయ్యారు. 

ఏపీలోని అమరావతి, విశాఖపట్నం వంటి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లల్లో క్యారియర్ HVAC (హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండీషనింగ్) వ్యవస్థలను అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయాలని మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఏపీలోని టైర్-2, టైర్-3 నగరాల్లో వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, ఆహార నిల్వలకోసం స్థిరమైన కోల్డ్ చైన్ లాజిస్టిక్ హబ్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయాలని ఆకాక్షించారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని అరుణ్ భాటియా పేర్కొన్నారు.

సింగపూర్‌లో ఎస్టీ టెలీమీడియా ఇన్వెస్ట్‌మెంట్స్ (ఇండియా) హెడ్ రీతూ మెహ్లావత్‌తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. భారత్‌లో కార్యకలాపాలను రెట్టింపు చేయాలని భావిస్తున్నందున డేటా సిటీగా ఆవిష్కృతమవుతున్న విశాఖపట్నంలో ఎస్టీ టెలిమీడియా గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేష్ కోరారు. 

ఉత్తరప్రదేశ్ తరహాలో అత్యాధునిక డేటా సెంటర్లు, కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల కల్పన, ఆప్టిమైజేషన్ ద్వారా బలమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని రీతూ మెహ్లావత్ వెల్లడించారు.

సింగపూర్ పర్యటనలో మూడో రోజు గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ డ్రూ బ్రైన్స్‌తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. విశాఖపట్నంలో సాధ్యమైనంత త్వరగా గూగుల్ డేటా సెంటర్ పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేష్ కోరారు.

 గూగుల్ తన సర్వర్ల కోసం సొంత చిప్‌లను రూపొందిస్తున్నందున వైజాగ్‌లోని ప్రతిపాదిత డేటా సెంటర్ క్యాంపస్‌లో చిప్ డిజైనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఎంఓయూలు చేసుకున్న ప్రాజెక్ట్‌లతో పాటు ఏపీ ప్రతిపాదనలపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని డ్రూ బ్రైన్స్ వెల్లడించారు.

ఏపీలో మురాఠా ఎలక్ట్రానిక్స్ ఏర్పాటు చేయాలి: మంత్రి నారా లోకేష్

సింగపూర్ పర్యటనలో భాగంగా మురాఠా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ హిరోయికి నివాతో మంత్రి నారా లోకేష్ సమావేశం అయ్యారు. ఏపీలో మురాఠా ఎలక్ట్రానిక్స్ అధునాతన ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా లోకేష్ కోరారు. 

ఏపీలో ఏరోస్పేస్, డిఫెన్స్ పాలసీ ద్వారా ప్రత్యేక క్లస్టర్లలో సంబంధిత యూనిట్ల ఏర్పాటుపై ప్రోత్సాహకాలు అందజేస్తున్నామని, అడ్వాన్స్ డ్ ఏరోస్పేస్ పరికరాల తయారీకి మద్దతు ఇచ్చే అనుబంధ యూనిట్లను ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా మంత్రి నారా లోకేష్ సూచించారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని మురాఠా ఎండీ తెలిపారు.