HYDERABAD:తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు మొదలవుతున్నాయి. రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో అన్ని పార్టీలు సభలు, సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు రాజకీయాలను నిర్ణయిస్తాయని భావిస్తున్న క్రమంలో ప్రధాన పార్టీలన్నీ ప్రత్యేకమైన దృష్టి సారించాయి.
స్థానిక సంస్థల ఎన్నికలకు వ్యూహాలు
తెలంగాణలో ప్రస్తుతం అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బి ఆర్ ఎస్, బిజెపి తమ బలాన్ని నిరూపించుకోవడానికి ఈ ఎన్నికలను వేదికగా చేసుకున్నాయి.స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా గ్రామపంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రజాప్రతినిధులను ఎన్నుకోవలసి ఉంటుంది. ఈ ఎన్నికలలో విజయం సాధించడం ద్వారా పార్టీలకు క్షేత్రస్థాయిలో తమ సంస్థాగత బలాన్ని పెంచుకోవాలని భావిస్తున్నాయి.
కాంగ్రెస్ వ్యూహమిదే
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఎవరికి వారు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల హవాను ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా కొనసాగించాలని భావిస్తోంది. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి నియోజకవర్గాల వారీగా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ కార్యాచరణ రూపొందిస్తోంది.
సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్ళాలని కాంగ్రెస్
అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్లి ప్రజా మద్దతును పొందాలని ప్రయత్నం చేస్తుంది. మరోవైపు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని నిర్ణయం, తమకు ఈ ఎన్నికలలో కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక 2023 అసెంబ్లీ, 2024 లోక్సభ ఎన్నికల ఓటమి తర్వాత బీఆర్ఎస్ అస్తిత్వ పోరాటంలో పడింది.
అస్తిత్వ పోరాటంలో బీఆర్ఎస్
ఈ స్థానిక సంస్థల ఎన్నికలు బిఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తును తేల్చనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. 2016, 2021 స్థానిక సంస్థల ఎన్నికలలో ఆధిపత్యం చెలాయించిన బీఆర్ఎస్, ఈ దఫా ఎన్నికలలో కూడా తన సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఈ మేరకు నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో సభలు సమావేశాలు నిర్వహిస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
ఆ ప్లాన్ తో ఎన్నికలకు వెళ్లాలని బీఆర్ఎస్, బీజేపీ
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చి స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలను రచిస్తున్నారు. ఇక బిజెపి లోక్సభ ఎన్నికలలో తన సత్తా చాటి తెలంగాణ రాష్ట్రంలో తన పట్టును చూపించిన వేళ, గ్రామీణ స్థాయిలో కూడా సంస్థాగతంగా బలం పెంచుకోవడానికి స్థానిక సంస్థల ఎన్నికలు గొప్ప అవకాశంగా భావిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్ తో పాటు, గ్రామీణ ప్రాంతాలలో సంస్థాగతంగా బలం పుంజుకోవడానికి సమావేశాలు, కార్యశాలలు నిర్వహిస్తూ ఎన్నికలకు సిద్ధమవుతోంది.
Social Plugin