HYDERABAD:తెలంగాణ వ్యాప్తంగా వరుణుడు విజృంభిస్తున్నాడు. ఇప్పటికే ఆసిఫాబాద్ లో రికార్డు వర్షపాతం నమోదైంది. శుక్ర (ఇవాళ), శనివారాల్లోనూ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నట్లు ఎండీ తాజా అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్‌సహా రాష్ట్రవ్యాప్తంగా గురువారం మొత్తం ముసురు వాన కురుస్తూనే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండ టంతో జన జీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. కాగా, పలు ప్రాంతాల్లో రికార్డు వర్షపాతం నమోదైంది. కుమురం భీం ఆసిఫాబాద్‌జిల్లా కౌటాలలో 6.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, సిర్పూర్(టి) మండలం లోనవెల్లిలో 5.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు, భద్రాద్రి జిల్లాల్లో కిన్నెరసాని, ముర్రేడు, తాలిపేరు, జిల్లేరు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. అలాగే భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లోనూ పలు చోట్ల లోలెవల్వంతెనలు మునిగిపోయాయి.
ఇక.. మున్నేరులో వరద ప్రవాహం కొనసాగగా, ఖమ్మం జిల్లా చిన్నమండవకు చెందిన పశువుల కాపరులు గురువారం మున్నేటి వరద ఒక్కసారిగా పెరగడంతో ఓ లంకలో చిక్కుకుపోయారు. వారిని ఖమ్మం ఎన్డీఆర్ఎఫ్బృందం, పోలీసులు పడవల సాయంతో కాపాడారు. ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు కామారెడ్డి, మెదక్, జనగామ, హనుమకొండ, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్జిల్లాల్లో వర్షాలు కరుస్తాయని వెల్లడించారు. రేపు (శనివారం) అన్ని జిల్లాలకు వర్షం హెచ్చరిక ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Social Plugin