Hot Posts

6/recent/ticker-posts

కర్నూలు బాగా డెవలప్ అయ్యింది.. కేంద్రం సరికొత్త ఆయుధ ప్రయోగాలు?


ANDHRAPRADESH:రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) కర్నూలుపై దృష్టి సారించింది. భవిష్యత్ లో ఆయుధ పరీక్షలకు కేంద్రంగా మార్చుకోనుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మిస్సైళ్లు, అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్, డ్రోన్లను ఇకపై ఇక్కడే పరీక్షలను నిర్వహించనుంది.

ఇందులో భాగంగా కొత్తగా డెవలప్ చేసిన ప్రెసిషన్ గైడెడ్ మిస్సైల్- వీ3ని కర్నూలులో పరీక్షించింది. ఇది- ఘన విజయం సాధించింది. ఈ పరీక్షలన్నీ కూడా విజయవంతం అయ్యాయి. ఈ విషయాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. అ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ట్వీట్ పోస్ట్ చేశారు.

కర్నూలులో గల నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ పరీక్షా కేంద్రంలో ప్రెసిషన్ గైడెడ్ మిస్సైల్- వీ3ని విజయవంతంగా పరీక్షించినట్లు వెల్లడించారు. అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ ద్వారా ఈ మిస్సైల్ ను ప్రయోగించినట్లు చెప్పారు. ఫలితంగా- శత్రు దుర్భేధ్యమైన ప్రాంతాల్లో కూడా ఈ అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ ద్వారా ఈ మిస్సైళ్లను సంధించవచ్చు.

ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. ఈ విజయం- ఆత్మ నిర్భర్ భారత్ కు అద్దం పట్టిందని అన్నారు. దేశంలో రక్షణ పరికరాలు, ఆయుధాల ఉత్పత్తి రంగంలో కొనసాగుతున్న పరిశ్రమలకు మరింత ఊతం ఇచ్చినట్టయిందని చెప్పారు. క్లిష్టమైన రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయా సంస్థలు అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని నిరూపించిందని అన్నారు.

డీఆర్డీఓ అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ ప్రెసిషన్ గైడెడ్ మ్యూనిషన్ లో ఇది సరికొత్త వేరియంట్. దీన్ని తొలిసారిగా ఈ ఏడాది బెంగళూరు యలహంకలో జరిగిన ఏరో ఇండియా 2025లో ప్రదర్శించారు. ఈ ఏరో ఇండియా ఈ ఏడాది ఫిబ్రవరి 10 నుండి 14 వరకు కొనసాగిన విషయం తెలిసిందే.

గైడెడ్ మిస్సైల్ పరీక్ష విజయవంతం కావడం పట్ల రాజ్ నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్డీఓ, ఇతర రక్షణ పరికరాల తయారీ పరిశ్రమ భాగస్వాములు, డీసీపీపీ, ఎంఎస్ఎంఈ, స్టార్టప్‌లకు అభినందనలు తెలియజేశారు. దేశ రక్షణ విభాగం శక్తి సామర్థ్యాలను మరోసారి ప్రపంచానికి తెలియజేసిందని అన్నారు.

ప్రెసిషన్ గైడెడ్ మిస్సైల్ గరిష్టంగా నాలుగు కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. ఎయిర్ టు సర్ఫేస్ మిస్సైల్ ఇది. ఆకాశం నుంచి భూమి మీద గల లక్ష్యాలను ఛేదించగలదు. పగలు లేదా రాత్రి వేళల్లో ఇది తన గమ్యాన్ని అందుకోగలుగుతుంది. కటిక చీకట్లోనూ లక్ష్యాన్ని ఛేదించడానికి వీలుగా ఇందులో ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ సీకర్‌ తో కూడిన కెమెరాను అమర్చారు.

12.5 కిలోల బరువు కలిగిన ఈ క్షిపణి చిన్న డ్యూయల్-థ్రస్ట్ సాలిడ్ ప్రొపల్షన్ యూనిట్‌తో పనిచేస్తుంది. ఇది పగటిపూట నాలుగు కిలోమీటర్లు, రాత్రి రెండున్నర కిలోమీటర్ల రేంజ్ ను చేరుకోగలదు. కమ్యూనికేషన్ కోసం ఇందులో 2- వే డేటా లింక్ అందుబాటులో ఉంటుంది. స్థిరంగా ఉన్న లేదా కదిలుతున్న లక్ష్యాలను ఛేదించగలదీ మిస్సైల్. ప్రస్తుతం మూడు రకాల ప్రెసిషన్ గైడెడ్ వేరియంట్లు రక్షణ శాఖలో అందుబాటులో ఉన్నాయి.