ANDHRAPRADESH:ఎన్నికల నిర్వహణలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర ఎన్నికల సంఘం ఈ మధ్య రాజకీయ పార్టీలతో ఢిల్లీలో భేటీ నిర్వహించింది. ఇందులో అన్ని పార్టీల నుంచి ప్రతినిధుల్ని ఆహ్వానించి వారి అభిప్రాయాలు తీసుకుంది. ఓవైపు బీహార్ ఎన్నికల కోసం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితాల సవరణ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వేళ ఈసీ నిర్వహించిన ఈ భేటీకి హాజరైన టీడీపీ తమ వంతుగా కీలక సూచనలు చేసింది. వీటిపై ఈసీ చర్యలు తీసుకునే లోపే ఇవాళ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాసింది.
ఇందులో టీడీపీ మొత్తం 13 అంశాల్ని ప్రస్తావించింది. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేసేందుకు వీలుగా ఈ 13 అంశాల్ని ఈసీ దృష్టికి తెస్తున్నట్లు టీడీపీ ఇందులో తెలిపింది. ఇప్పటికే ఢిల్లీలో ఈసీ నిర్వహించిన భేటీకి తమ ప్రతినిధులు వెళ్లి ఇందులో చాలా అంశాలు ప్రస్తావించినట్లు పేర్కొంది. వీటితో పాటు మరికొన్ని అంశాలపైనా చర్యలు తీసుకోవాలంటూ ఓ లేఖను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ కార్యాలయం పంపింది.
టీడీపీ ప్రస్తావించిన అంశాల్లో బీఎల్వోలు, బీఎల్ఏలు ఎప్పటికప్పుడు స్దానిక సంస్థల నుంచి చనిపోయిన వారి వివరాలు సేకరించి ఓటరు జాబితాల్ని అప్ డేట్ చేయాలని, తద్వారా ఎన్నికల సమయంలో చెల్లని ఓట్ల సంఖ్యను తగ్గించవచ్చని తెలిపింది. అలాగే ఓ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓటర్లు, మరో పోలింగ్ కేంద్రంలో తమ ఓటు నమోదు చేయించుకోకుండా చూడాలని కోరింది. ప్రస్తుతం అనుసరిస్తున్న జీరో డోర్ నంబర్ విధానం స్ధానంలో తాత్కాలికంగా సమీప డోర్ నంబర్ ఇచ్చేలా చూడాలని కోరింది.
ప్రభుత్వ కార్యాలయాల్లో పోలింగ్ కేంద్రాలు పెట్టడం వల్ల సిబ్బంది, పోలింగ్ ఏజెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దానికి బదులు అన్ని వసతులతో కూడిన ప్రైవేటు స్కూల్స్, కాలేజీలు, హాల్స్ ను అనుమతిస్తే భద్రతా పరంగా కూడా ఇబ్బందులు ఉండవని తెలిపింది. ఒక రాష్ట్రంలో ఓటరుకు ఒకే ఓటు ఉండేలా చూడాలని, ఇతర రాష్ట్రాల ఓటర్లను స్థానికంగా ఓటు వేసేందుకు అనుమతించకుండా డూప్లికేట్ ఓట్లను తొలగించాలని కోరింది. ఈవీఎంలు పనిచేయక ఓటింగ్ ఆలస్యమైనప్పుడు సాయంత్రం క్యూలో ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తామని చెప్పకుండా పోలింగ్ సమయం పెంచాలని కోరింది.
బీఎల్ఏలు సమర్ధంగా విధులు నిర్వహించేలా శిక్షణ ఇవ్వాలని, వీరికి ఐడీ కార్డులు ఇవ్వాలని, వాటిపై పార్టీ ప్రతినిధుల సంతకాలు కూడా ఉండేలా చూడాలని కోరింది. బీఎల్వోలకు ఓట్ల నమోదు కోసం ఇస్తున్న యాప్ మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా చూడాలని, నెట్ లేకపోతే ఆఫ్ లైన్ లో కూడా పనిచేసేలా ఉండాలని తెలిపింది. ఈవీఎంలకు అనుసంధానం చేస్తున్న వీవీ ప్యాడ్లలో గుర్తులు కనిపించడం లేదని, వాటి సైజు పెంచాలని, అలాగే లైట్ బ్లింక్ అయ్యే టైమ్ పెంచాలని కోరింది.
కాలేజీల్లో 18 ఏళ్లు నిండిన వారికి అక్కడే ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా ఓటింగ్ శాతం కూడా పెరుగుతుందని తెలిపింది. ఈ సమాచారం సీఈవో, ఆర్వోకు కాలేజీలు పంపేలా చూడాలని కోరింది. అలాగే ప్రతీ వీవీ ప్యాడ్ లోనూ 50 శాతం స్లిప్లులు ప్రత్యేకంగా లెక్కించాలని, తద్వారా అనుమానాలు నివృత్తి చేయొచ్చని తెలిపింది. పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులు, దివ్యాంగులకు కల్పిస్తున్న సౌకర్యాలను గర్భిణీలకు కూడా వర్తింప చేయాలని కోరింది. ఇందుకోసం అంగన్ వాడీ కార్యకర్తల సాయం తీసుకోవచ్చని తెలిపింది. ఓటరు కార్డులపై ఫొటోల సవరణ కార్యక్రమం కూడా తరచుగా నిర్వహించడం వల్ల దొంగఓట్ల సమస్యను నివారించవచ్చని టీడీపీ తెలిపింది. ప్రతీ 900 మంది ఓటర్లకు ఓ పోలింగ్ కేంద్రం ఉండేలా వాటి సంఖ్య పెంచాలని కోరింది.
Social Plugin