Hot Posts

6/recent/ticker-posts

ప్రత్యేక జిల్లాగా అమరావతి, లిస్టులో - మండలాలు, సరిహద్దుల మార్పు..!!


ANDHRAPRADESH:ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. జిల్లాల పేర్లు.. సరిహద్దులు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్వ్యవస్థీకరణ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో అప్పటి వరకు ఉన్న 13 జిల్లాలను 26కు పెంచింది. జిల్లాలతో పాటుగా మండలాల పైన ప్రభుత్వానికి పెద్ద సంఖ్యలో వినతులు వచ్చాయి. దీంతో, వీటి పైన అధ్యయనం చేసి నివేది క ఇవ్వాలని ఏడుగురు మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీకి బాధ్యతలు అప్పగించింది. ఇక, అమరావతిని ప్రత్యేక జిల్లాగా చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వం చేసిన జిల్లాల పునర్ వ్యవస్థీకరణ పైన ప్రజల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి అనేక అభ్యంతరాలు, విజ్ఞప్తులు వచ్చాయి. విజ్ఞప్తులను పరిశీలించడానికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లాలు, 77 రెవెన్యూ డివిజన్లు, 685 మండలాలు, 13,324 గ్రామ పంచాయి తీలు ఉన్నాయి. ఈ కమిటీ ఈ అన్ని అంశాలపై సమీక్షించి, అవసరమైన మార్పులు, చేర్పులను సూచించనుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా, రాజధాని అమరావతిని ఒక ప్రత్యేక జిల్లాగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అమరావతిని జిల్లాగా ప్రకటించడం ద్వారా రాజధాని ప్రాంత అభివృద్ధికి మరింత ప్రాధాన్యత లభిస్తుందని భావిస్తున్నారు. అదే విధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్కాపురం కేంద్రంగా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురం కేంద్రంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని బలమైన డిమాండ్లు ఉన్నాయి. వీటిని కమిటీ పరిశీలించనుంది. అన్నమయ్య జిల్లాకు రాయచోటి కాకుండా రాజంపేటను జిల్లా కేంద్రం గా చేయాలని కొన్ని ప్రాంతాల ప్రజలు డిమాండ్ చేస్తుండగా, మరికొందరు రాయచోటినే కొన సాగించాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలను తిరిగి కృష్ణా జిల్లాలోనే ఉంచాలని డిమాండ్లు ఉన్నాయి.

అదే విధంగా అల్లూరి సీతారామరాజు జిల్లా లోని వై.రామవరం మండలాన్ని విభజించి కొత్త మండ లాన్ని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వ హయాంలోనే హామీలు ఉన్నప్పటికీ, అవి కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. కేబినెట్ సబ్ కమిటీ జిల్లాల పునర్వ్యవస్థీకరణను శాస్త్రీయంగా, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ చేపట్టాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియలో ప్రజల నుండి సూచనలు, అభ్యంతరాలను స్వీకరించి, వాటిని నివేదికలో చేర్చనున్నారు.