Hot Posts

6/recent/ticker-posts

మాజీమంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌కు బిగ్ షాక్..!


ANDHRAPRADESH:వైసీపీ నేత, మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌కు బిగ్ షాక్ తగిలింది. టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఈనెల 26న కోవూరు పీఎస్‌లో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. అనిల్‌ అందుబాటులో లేకపోవడంతో అతని ఇంటికి నోటీసులు అంటించారు. అయితే కొవ్వూరులో వైఎస్సార్‌సీపీ సమావేశంలో పాల్గొన్నందుకు.. ప్రశాంతి రెడ్డి ఎపిసోడ్‌పై అనిల్‌ కుమార్‌ మాట్లాడినందుకు గానూ.. ఆయనకు నోటీసులు ఇచ్చినట్టు సమాచారం.

మరోవైపు నెల్లూరు జిల్లాలో చోటుచేసుకున్న అక్రమ క్వార్ట్ జ్ తవ్వకం వ్యవహారంలో అనిల్‌కు సంబంధించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి హైదరాబాదులో అరెస్ట్ కాగా, తన వివరణలో అనిల్ కుమార్‌తో పాటు కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా భాగస్వాములుగా ఉన్నట్టు వెల్లడించాడని అంటున్నారు. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు అనిల్‌కుమార్‌ను కూడా A-12 నిందితుడిగా జాబితాలో చేర్చారని భావిస్తున్నారు.

కాగా ఇటీవల వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి బహిరంగ సభలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అత్యంత అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రశాంతి రెడ్డి "అన్ని రంగాల్లో పీహెచ్‌డీ" చేశారని.. ఆమె తన భర్త, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బ్లాక్‌మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నారని అన్నారు. ఆమె చరిత్ర తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసని.. అంతేకాకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రసన్నకుమార్ వ్యాఖ్యలపై ప్రశాంతిరెడ్డి తీవ్రంగా స్పందించారు. నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయనపై పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోరారు. సదరు వ్యాఖ్యలను వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సీరియస్‌గా తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలానే మహిళా సంఘాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సహా పలువురు ప్రముఖులు ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు

ఆ తర్వాత నెల్లూరులోని సుజాతమ్మ కాలనీలో ఉన్న ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఇంట్లోని ఫర్నిచర్, గాజు వస్తువులు, కారు ధ్వంసం చేశారు. ఈ దాడులతో తనకు సంబంధం లేదని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఖండించారు. ప్రసన్నకుమార్ వల్ల గతంలో చాలామంది బాధపడ్డారని, వారిలో ఎవరో ఒకరు ఈ దాడి చేసి ఉండొచ్చని ఆమె అన్నారు.