ANDHRAPRADESH:ఏపీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజా చిత్రం హరి హర వీరమల్లు ఇవాళ విడుదలైంది. ఈ సినిమాకు మిక్సెడ్ టాక్ వస్తోంది. అదే సమయంలో ఇవాళ అమరావతిలో కేబినెట్ భేటీ ఉండటంతో పవన్ కళ్యాణ్ సినిమా హడావిడిని కాస్త పక్కనబెట్టి సచివాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. కేబినెట్ భేటీకి సంబంధించి అధికారికంగా విడుదల చేసిన ఫొటోలు చూస్తే ఈ విషయం అర్థమవుతోంది.
పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా నిన్న సీఎం చంద్రబాబుతో పాటు నారా లోకేష్, ఇతర మంత్రులు, నాయకులు ఆయనకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన వారిలో ఉన్నారు. అయితే ఇవాళ సినిమా విడుదల కావడం, అదే సమయంలో కేబినెట్ భేటీ కూడా ఉండటంతో పవన్ సచివాలయానికి వచ్చారు. దీంతో సీఎం చంద్రబాబు ఆయన్ను ప్రత్యేకంగా కలుసుకున్నారు.
కేబినెట్ భేటీ ప్రారంభానికి ముందు పవన్ ను ఆత్మీయంగా పలకరించి షేక్ హ్యాండ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు హరి హర వీరమల్లు చిత్రంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. దీనికి పవన్ కూడా మంచి స్పందన వస్తోందని చెప్పినట్లు సమాచారం. దీంతో చంద్రబాబు కూడా పవన్ కు అభినందనలు తెలిపారు. చంద్రబాబు-పవన్ మాట్లాడుకుంటున్న ఫోటోల్ని ఈసారి ప్రభుత్వంతో పాటు జనసేన కూడా విడుదల చేశాయి. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత పవన్ కళ్యాణ్ చిత్రం రిలీజ్ కావడంతో ఓవైపు అభిమానులతో పాటు కూటమి పార్టీల నాయకులు, శ్రేణులు కూడా పండగ చేసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే కూటమి పార్టీల్లో టీడీపీ, బీజేపీ ఎప్పుడూ లేనంతగా పవన్ సినిమాను ఓన్ చేసుకుని సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నాయి. ఓవైపు వైసీపీ పవన్ సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ ట్వీట్లు పెడుతుంటే దానికి కౌంటర్ గా కూటమి పార్టీలు హరిహర వీరమల్లు బ్లాక్ బస్టర్ అయినట్లు కౌంటర్ ట్వీట్లు పెడుతున్నారు.
Social Plugin