ANDHRAPRADESH:పలువురు మంత్రుల తీరు పైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు. ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో వీరి పనితీరు.. ప్రోగ్రెస్ రిపోర్టుల ఆధారంగా చంద్రబాబు తన నిర్ణయాల ను వెల్లడించనున్నారు. అదే విధంగా అమరావతి రెండో విడత భూ సమీకరణతో పాటుగా పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. రాజకీయంగానూ ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల పైన నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.
42 అంశాలతో అజెండ
ఏపీ మంత్రివర్గ భేటీ మొదలైంది. 42 అంశాల అజెండాతో సమావేశం జరుగుతోంది. ఇప్పటికే ఎస్ఐబీపీ పంపిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. అమరావతిలో రెండో విడత భూ సమీకరణ పైన కొద్ది రోజులుగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అంశం పైన డిప్యూటీ సీఎం పవన్ సైతం అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈ రోజు సమావేశంలో దీని పైన చర్చించి తుది నిర్ణయం తీసుకోన్నారు. రాజధానికి సంబంధించి సీఆర్డీఏ ఇచ్చిన ప్రతిపాదనల పైన చర్చించున్నారు. నాలా చట్ట సవరణకు సంబంధించి చర్చ చేసి నిర్ణయిం తీసుకోనున్నారు.
కొత్త పాలసీలకు ఆమోదం
ఈ భేటీలో పలు సంస్థలకు భూ కేటాయింపుల పై కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. అదే విధంగా ప్రభుత్వం లో సైన్స్ అండ్ టెక్నలాజి కొత్త శాఖ ఏర్పాటు సంబంధించి కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. పట్టణ ప్రాంతాల్లో అనుమతులు లేకుండా చేసిన నిర్మాణాలు.. లే అవుట్ల క్రమబద్దీకరణకు వీలుగా మున్సిపల్ శాఖ చేసిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది. ఇక.. మంత్రులు పని తీరు మెరుగుపర్చుకోవాలని ప్రతీ సందర్భంలో చెప్పినా మార్పు రాకపోవటం పైన చంద్రబాబు ఆగ్రహం తో ఉన్నారు. ఇక, ఈ రోజు సమావేశం లో అధికారిక అజెండా తరువాత రాజకీయ అంశాలు చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది.
ఆ ఇద్దరి వ్యాఖ్యలతో
మంత్రులు అచ్చెన్నాయుడు, నారాయణ తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. పథకాల అమలు పైన అచ్చెన్నాయుడు.. అమరావతిలో పనుల విషయంలో అధికారుల పైన నారాయణ చేసిన వ్యాఖ్యల తో రాజకీయంగా టార్గెట్ అయ్యారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇర కాటంలోకి నెట్టే విధంగా ఉన్నాయనే అభిప్రాయం సొంత పార్టీలోనే వ్యక్తం అవుతోంది. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ ఇద్దరు చేసిన వ్యాఖ్యలు వైరల్ కావటంతో పాటుగా.. మరి కొందరు మంత్రుల పని తీరులో ఎలాంటి మార్పు రాలేదని గుర్తించినట్లుగా తెలుస్తోంది. దీంతో.. నేటి కేబినెట్ భేటీలో మంత్రుల పైన చంద్రబాబు ఎలాంటి మార్గనిర్దేశం చేస్తారనేది కీలకంగా మారుతోంది.
Social Plugin