Hot Posts

6/recent/ticker-posts

తల్లికి వందనంలో బిగ్ ట్విస్ట్-4లక్షల మందికి సగం డబ్బులే ? సర్కార్ క్లారిటీ ..!


ANDHRAPRADESH:ఏపీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తల్లికి వందనం పథకం నిధుల్ని తాజాగా విడుదల చేసింది. తొలి ఏడాది తల్లికి పథకం అమలు చేయకుండా తప్పించుకున్నారన్న విమర్శల నేపథ్యంలో తాజాగా ఇంట్లో ఎంత మంది చదువుకునే పిల్లలు ఉంటే అంత మందికి రూ.15 వేల చొప్పున విడుదల చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీని కోసం రూ.10 వేల కోట్ల వరకూ ఖర్చు చేసారు. అయితే ఇంత చేసినా దాదాపు 4 లక్షల మంది ఎస్సీ విద్యార్ధులకు మాత్రం షాకిచ్చినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో 9, 10, ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ చదువుతున్న 3.93 లక్షల మంది ఎస్సీ విద్యార్ధులకు కేవలం రూ.5200 నుంచి రూ.10972 మధ్య ఒక్కొక్కొరికి ఒక్కో మొత్తం జమ అయినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం తల్లికి వందనంలో భాగంగా ఇస్తామన్న రూ.15 వేలకు బదులు తమకు రూ.8850 మాత్రమే ఇచ్చినట్లు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పాలకోడేరు గ్రామ విద్యార్థి ఒకరు వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఇవాళ దీనిపై క్లారిటీ ఇచ్చింది. తల్లికి వందనం పథకం కింద కూటమి ప్రభుత్వం రూ.15,000లకు బదులు రూ.8,850లు మాత్రమే ఇచ్చిందని... 'ఇంటింటా నిజం - తల్లికి మోసం' అంటూ శీర్షిక పెట్టి ఒక పత్రికలో వార్తా కథనం వచ్చిందని, ఈ వార్త పట్ల లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందనక్కరలేదని ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ లో తెలిపింది. అసలు విషయం ఏమంటే... రాష్ట్రంలో 9,10 తరగతులు, ఇంటర్మీడియట్ 1, 2 సంవత్సరం చదువుతున్న ఎస్సీ విద్యార్థులు 3.93 లక్షల మంది ఉన్నారని, తల్లికి వందనం పథకంలో వీరికి సంబంధించి కొంత వాటాను కేంద్రం భరిస్తుందని ప్రభుత్వం తెలిపింది

ఆ సొమ్ము బ్యాంక్ లింకేజి అయిన విద్యార్థులు/ తల్లి దండ్రుల అకౌంట్ లలో మరో 20 రోజుల్లో జమ అవుతుందని వెల్లడించింది. అప్పటివరకు వారికి ఆర్థిక ఇబ్బంది తలెత్తకూడదన్న ఉద్దేశంతో ఈలోపుగానే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు రూ.382.66 కోట్లను వారి ఖాతాల్లో జమచేసిందని తెలిపింది. అందువల్లనే ఎస్సీ విద్యార్థుల ఖాతాలకు రూ.5,200 నుండి రూ.10,972/- వరకు జమచేయబడిందని పేర్కొంది. మిగిలిన సొమ్మును కేంద్ర ప్రభుత్వం రాబోయే 20 రోజుల్లోపు తల్లులు/విద్యార్థుల ఆధార్-లింక్డ్ బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేస్తుందని చెప్పింది. కాబట్టి ఇటువంటి వార్తల పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చేసింది.