Hot Posts

6/recent/ticker-posts

హామీలు గాలికొదిలారా?.. కాంగ్రెస్‌పై కవిత పోస్ట్‌కార్డుల యుద్ధం

HYDERABAD:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బస్తీ మే సవాల్ అంటాడు.. మరునాడే పరార్ అవుతాడు.." అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏ ఒక్క కూడా మాట మీద నిలబడబోరని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాకునూరు గ్రామంలో స్థానిక మహిళలతో కలిసి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి ఎమ్మెల్సీ కవిత పోస్ట్ కార్డులు పోస్ట్ చేశారు. అంతకుముందు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్న ఎన్నికల హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. వికలాంగులు, వృద్ధులు, మహిళలు సహా ఇతర పింఛన్లు పెంచేలా సోనియాగాంధీ తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విస్మరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకుండా మోసం చేయడమే కాకుండా రెండు సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు డబ్బులను ఎగవేసిందని మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నామనే పేరు చెప్పి ఉన్న బస్సుల సంఖ్య తగ్గించారని, ఉచిత బస్సు ఇవ్వాల్సిందేనని, అదే సమయంలో బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క కాకునూరు గ్రామ మహిళలకే ఈ 18 నెలల్లో రూ 5 కోట్లు బాకీ పడ్డారని, మన ఇంటి అడబిడ్డలకు స్కూటీలు ఇప్పించేందుకు అందరూ ఉద్యమించాలని అన్నారు. కళ్యాణ లక్ష్మీ కింద రూ లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కేసీఆర్ జపం చేసుడు తప్ప రేవంత్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు కేసీఆర్ హయాంలోనే 90 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులు పూర్తి చేయకుండా పక్కనబెట్టారని ఆరోపించారు. కొడంగల్ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులో తట్ట మట్టి తియ్యకుండానే కాంట్రాక్టర్లకు వందల కోట్ల రూపాయలను అడ్వాన్స్ రూపంలో ఇచ్చారని, రూ.2 లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్ రెడ్డి ఆ పైసలు ఏం చేశారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా ఏం చేయకున్నా పర్వాలేదని, కానీ కేసీఆర్ పెట్టిన పథకాలను కొనసాగించాలని కోరారు. ముఖ్యంగా కేసీఆర్ పెట్టిన గురుకులాను దారుణంగా, అన్యాయంగా మార్చేశారని, గురుకులాల్లో బిడ్డలు చనిపోతున్నా ప్రభుత్వానికి పట్టింపులేదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, నాయకులు సీమల రమేశ్, రూప్ సింగ్, ఆలకుంట హరి, కొట్టాల యాదగిరి, శివారెడ్డి, ముస్తఫా, బాలాజి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.