Hot Posts

6/recent/ticker-posts

రా బావా, సెల్ఫీ దిగుదాం.. భర్తను చంపాలనుకున్న భార్య.. చావకపోవడంతో డ్రామా!


HYDERABAD:ఇటీవల కాలం భార్యాభర్తలకు చెందిన అనేక ఘటనలు తరచుగా వార్తలలో నిలుస్తూ ఉంటాయి. చాలా చోట్ల భార్యలు తమ భర్తల్ని ప్రియుడితో కలిసి హత్య చేస్తుంటే.. కొన్ని చోట్ల భర్తలు తమ భార్యలను హత్య చేస్తున్నారు. సమాజంలో జరుగుతున్న దారుణాలను చూసి చాలా మంది పెళ్లి అంటేనే భయంతో దూరంగా పారిపోతున్నారు. ఇటీవల చాలా వరకు భార్యలు భర్తల్ని హతమార్చిన ఘటనలు ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నాయి. తాజాగా సెల్ఫీ దిగుదాం రా బావ అంటూ.. తన భర్తను నదిలో తోసేసింది ఓ భార్య. కర్ణాటక-తెలంగాణ బార్డర్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

కర్ణాటకలోని రాయచూరు జిల్లా శక్తి నగర్‌కు చెందిన తాతప్ప ఆయన భార్యతో కలిసి తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాలోని చేగుంటకు వస్తున్నారు. వీరిద్దరు బైక్ మీద వాతావరణం చల్లగా ఉందని సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో రాయచూరు జిల్లాలోని కడ్లూరు మధ్య ఉన్న కృష్ణానది బ్రిడ్జి వద్దకు రాగానే నది చాలా అందంగా ఉందని.. రా బావా సెల్ఫీలు దిగుదామంటూ భార్య చెప్పింది. దీంతో పాపం.. అమాయకుడైన భర్త తన భార్య నీచపు ఆలోచనను పసిగట్టలేకపోయాడు. తన భార్యతో మాట్లాడుతూ కొన్ని సెల్ఫీలు కూడా దిగాడు. ఈ క్రమంలో అతడితో మంచిగా మాట్లాడుతున్నట్లు నటిస్తూ ఒక్కసారిగా భర్తను గట్టిగా నదిలోకి తోసేసింది. తాతప్ప నదిలో పడిపోయాడు. అతడికి ఈత రాకపోవడంతో నదిలో కొట్టుకుపోతూనే రక్షించండి అంటూ కేకలు వేశాడు.

మరోవైపు తనకేమీ తెలియనట్టు తన భర్తను కాపాడాలంటూ భార్య కూడా కేకలు వేసింది. నదిలో కొట్టుకుపోతున్న సమయంలో తాతప్పకు బండరాళ్లు దొరకడంతో వాటిని గట్టిగా పట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆమె కేకలు విన్న స్థానికులు అతడిని తాడు సహాయంతో కాపాడి ఒడ్డుకు చేర్చారు. భర్తను చంపాలనుకున్న భార్య ప్లాన్ బెడిసికొట్టడంతో నిరాశే మిగిలింది. ప్రమాదవశాత్తూ భర్త నదిలోకి పడిపోయాడని.. ఆ మహిళ డ్రామాకు తెరలేపింది. నది నుంచి బయటకు వచ్చిన తాతప్ప తన భార్యే తనను చంపాలని నదిలోకి తోసేసిందని ఆరోపించాడు.

సెల్ఫీ దిగుదాం బావ అంటూ నమ్మించి బ్రిడ్జి అంచుకు తీసుకువచ్చి నదిలో తోసివేసిందని ఆవేశంతో ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడిని అక్కడున్న వాళ్లు అడ్డుకున్నారు. ఈ ఘటనను అక్కడున్న వారు వీడియో తీశారు. అయినా ఆమె అతడిని ఎందుకు చంపాలనుకుంది. వారిద్దరి మధ్య ఏమైనా విబేధాలు ఉన్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది. భర్త మాత్రం తృటిలో చావు నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది.