HYDERABAD:తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళా సాధికారత కోసం కృషి చేస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సేవలను అందించడం మాత్రమే కాకుండా, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ల పథకాన్ని కూడా అందిస్తోంది. అంతేకాదు మహిళా సాధికారత కోసం ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్న ప్రభుత్వం మహిళా స్వయం సహాయక గ్రూపులను ప్రోత్సహిస్తూ వారికి అండగా నిలుస్తుంది.
మహిళల ఆర్ధికాభివృద్ధికి కృషి చేస్తున్న సర్కార్
ఆర్టీసీలో అద్దె బస్సులను మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇవ్వడం, మహిళా ఇందిరా క్రాంతి పథకం ద్వారా హోటల్స్ నిర్వహణ, పెట్రోల్ బంక్ నిర్వహణ, గోడౌన్స్ నిర్వహణ, సోలార్ పవర్ ప్లాంట్స్, హాస్టళ్లకు ఫుడ్ సరఫరా వంటి అనేక అవకాశాలను మహిళలకు ఇస్తోంది. ఇక తాజాగా రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు అవకాశం ఉన్న ప్రతి చోట డెయిరీలను ఏర్పాటు చేయాలని, తద్వారా వారి ఆర్థిక అభివృద్ధికి దోహదం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
మహిళలతో డెయిరీ ఫామ్ ల ఏర్పాటుకు ప్లాన్
పేద, మధ్యతరగతి ప్రజల అభ్యున్నతి కోసం తీసుకునే ఈ నిర్ణయంలో భాగంగా సెర్ప్ సంస్థ ద్వారా మహిళలకు డెయిరీ యూనిట్లు ఇప్పించాలని ప్లాన్ చేసింది. దీనికోసం ఇప్పటికే అధ్యయనం చేసిన సెర్ప్ త్వరలో నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ సంస్థ సహాయం కూడా తీసుకొని మహిళలు డెయిరీ ఫామ్ నిర్వహణకు కావలసిన ప్లాన్ ను రెడీ చేస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా డెయిరీల ఏర్పాటుకు పరిశీలన
ఇప్పటికే హన్మకొండ జిల్లా పరకాల వంటి ప్రాంతాలలో డెయిరీ ఫామ్ ఏర్పాటుకు శరవేగంగా అధికార యంత్రాంగం పనులు చేస్తున్నారు. ములకనూరు మహిళా సహకార డెయిరీ ని అధ్యయనం చేసి, అదే తరహాలో పరకాలలో కూడా డెయిరీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఒక పరకాలలో మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో డెయిరీ లను ఏర్పాటు చేసి స్వయం సహాయక బృందాలలోని మహిళల ద్వారా వాటిని నిర్వహించేలా చేయాలని సెర్ప్ భావిస్తోంది.
బ్యాంకు రుణాలు ఇప్పించి మహిళలకు అండగా సెర్ప్
అందుకు కావలసిన రుణాలను కూడా బ్యాంకుల నుండి ఇప్పించాలని నిర్ణయించింది. అయితే బ్యాంకుల నుంచి ఇప్పించే రుణాలకు వడ్డీ తక్కువగా ఉండొచ్చు లేదా అసలే ఉండకపోవచ్చు. సులభ వాయిదాలలో ఈ రుణాలను చెల్లించడానికి వీలు ఉంటుంది. డెయిరీ యూనిట్ పెట్టించి, ట్రైనింగ్ ఇచ్చి తద్వారా మహిళలకు ఉపాధి కల్పించాలని నిర్ణయించిన క్రమంలో ప్రభుత్వం అన్ని విధాల సహకారాన్ని అందించి మహిళలను ఆర్థికంగా ప్రగతి బాటలో నడిపించాలని ప్రయత్నం చేస్తుంది.
డెయిరీ యూనిట్ కావాలంటే శిక్షణ ఇచ్చి అవకాశం
ఎవరైనా సరే మహిళలందరూ ఒకటిగా డెయిరీ యూనిట్ తమకు కావాలని కోరితే వారికి అన్ని విధాలా అండగా ఉండి సెర్ప్ అన్ని వివరాలను తెలియజేసి శిక్షణ ఇచ్చి మరీ మహిళలకు అవకాశం కల్పిస్తారు. ఇక ఇటువంటి అవకాశం కల్పించడం నిజంగానే తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు భారీ శుభవార్త.
Social Plugin