Hot Posts

6/recent/ticker-posts

అనుమతులు లేకుండా యూనివర్సిటీ ప్రారంభించడం పెద్ద తప్పు: షర్మిల

వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ వర్సిటీ విద్యార్థుల సమస్యలపై షర్మిల ఆందోళన

సీఓఏ అధికారులను కలిశానని షర్మిల వెల్లడి

సమస్య పరిష్కారం కాకపోతే ఢిల్లీ వెళతామని స్పష్టీకరణ

ANDHRAPRADESH:ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడపలోని వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (సీఓఏ) అధికారులతో భేటీ అయిన షర్మిల, విద్యార్థుల భవిష్యత్తు కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ఆమె ఎక్స్ లో స్పందించారు.

"కడప వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన సీఓఏ అధికారులను విజయవాడలో కలవడం జరిగింది. గత ప్రభుత్వ హయంలో సీఓఏ అనుమతులు లేకుండా అడ్మిషన్లు చేశారు. ఇప్పుడు విద్యార్థులకు సర్టిఫికెట్లు రావడం లేదు. వందలాది మంది విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. సీఓఏ అనుమతులు లేకుండా లైసెన్సులు రావడం లేదు. విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ విద్యార్థుల కష్టాలు నేను ప్రత్యక్షంగా చూశా. 

ఆనాడు అనుమతులు లేకుండా యూనివర్సిటీ ప్రారంభించడం పెద్ద తప్పు. ఈ తప్పు సరిదిద్దాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. రెండేళ్లుగా విద్యార్థులు పోరాటం చేస్తున్నా ఫలితం లేదు. వెంటనే సీఓఏ అనుమతులు తీసుకొని విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరాం. ఢిల్లీ స్థాయిలో సీఓఏను కలుస్తాం అని హెచ్చరించాం. ఒక నెల గడువు ఇచ్చాం. అధికారులు సానుకూలంగా స్పందించారు. ఈ తప్పును సరిద్దుతున్నాం అని హామీ ఇచ్చారు. నెల రోజుల్లో వైఎస్ఆర్ యూనివర్సిటీ విద్యార్థుల సమస్య పరిష్కారం కాకపోతే ఢిల్లీకి వెళతామని కాంగ్రెస్ పార్టీ తరపున హెచ్చరిస్తున్నాం" అని షర్మిల స్పష్టం చేశారు.