ఇక ఎమ్మెల్యే ఎన్నికల ముందు మాత్రమే ప్రజలకు కనిపించారని గత ఏడాదిగా ఆమె జనంలోకి రావడం లేదని అంటున్నారు.
VIJAYANAGARAM:విజయనగరం జిల్లా అంటేనే పూసపాటి వారిది అని చెప్పుకుంటారు. దాదాపుగా ఏడు దశాబ్దాల నుంచి మూడు తరాలుగా రాజకీయం చేస్తున్న కుటుంబం అది. పెవీజీ రాజుతో మొదలుపెడితే ఆయన తనయుడు అశోక్ గజపతిరాజు నిన్నటిదాకా ఎమ్మెల్యేగా ఎంపీగా చేసి ఉన్నారు. ఇక ఇపుడు అశోక్ కుమార్తె అదితి గజపతిరాజు విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
అయితే ఆమె మీద తాజాగా విమర్శలు వస్తున్నాయి. చేస్తున్నది వైసీపీ అయితే ఓకే అనుకోవచ్చు. కానీ ఏకంగా సొంత పార్టీ నుంచే విమర్శలు రావడం విశేషం. తాజాగా రాజీవ్ నగర్ కాలనీకి చెందిన ఒక కార్యకర్త వెళ్ళి ఏకంగా కలెక్టరేట్ వద్ద ఒక ఫ్లెక్సీతో ఎమ్మెల్యేల మీద విమర్శలు రాసుకుని మరీ చాలా సేపు ప్రదర్శన చేశారు.
ఎమ్మెల్యే కనిపించడం లేదని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే జనంలోకి రావాలని ఆయన కోరారు. వార్డులలో పర్యటించాలని ప్రజా సమస్యలు తెలుసుకోవాలని కూడా కోరారు. ఇక ప్రజలు సమస్యలు చెప్పుకోవాలన్నా కార్యకర్తలు కలవాలన్నా కోట గుమ్మం వద్దనే ఆపేస్తున్నారాని కొందరు అక్కడ నేతలుగా మారి సరిగ్గా స్పందించడం లేదని కూడా ఆయన అంటున్నారు.
మరో వైపు చూస్తే కూటమి నేతలు కూడా ఎమ్మెల్యే పని తీరు పట్ల పెదవి విరుస్తున్నారని అంటున్నారు. ఆమె అందుబాటులోకి రావడం లేదని అంటున్నారు. ఇక ఎమ్మెల్యే తరఫున ఒక నాయకుడు షాడో ఎమ్మెల్యేగా మారి అన్ని పనులూ చక్కబెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతే కాదు ఆయనే అధికారులతో భేటీలు వేస్తూ ఆదేశాలు ఇచ్చే స్థాయికి చేరుకున్నారని అంటున్నారు.
దీని వల్ల ఎమ్మెల్యేకే వ్యతిరేకత వస్తోందని అంటున్నారు. ఇక చూస్తే విజయనగరం పేరుకు జిల్లా కేంద్రం కానీ ఈ రోజుకీ ఒక మామూలు పట్టణం మాదిరిగానే ఉంటుంది. జిల్లా కేంద్రంలోనే ఎన్నో సమస్యలు ఉన్నాయి. అనేక కాలనీలలో రోడ్ల నుంచి కాలువల నుంచి కొళాయిల నుంచి ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి. చినుకు పడితే చిత్తడి అయ్యే ప్రాంతాలు కూడా ఎన్నో ఉన్నాయని చెబుతున్నారు.
ఇక ఎమ్మెల్యే ఎన్నికల ముందు మాత్రమే ప్రజలకు కనిపించారని గత ఏడాదిగా ఆమె జనంలోకి రావడం లేదని అంటున్నారు. ఎమ్మెల్యేగా ఆమె చురుకుగా వ్యవహరించాలని డైనమిక్ గా ఉండాలని అంతా అంటున్నారు పైగా ప్రముఖ వంశీకురాలిగా ఘనమైన రాజకీయ వారసత్వం కలిగిన మహిళా నాయకురాలిగా ఆమె మరింతగా శ్రమించాలని అంతా అంటున్నారు.
ఆమె తొలిసారి గెలిచారు. అంతకు ముందు 2019 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఇక విజయనగరం అసెంబ్లీ సీటు గురించి చెప్పుకోవాలీ అంటే అది ఎక్కువ మంది బీసీలు ఉన్న నియోజకవర్గం. గత నాలుగు దశాబ్దాలుగా ఓసీలే ఇక్కడ నుంచి గెలుస్తున్నారు అన్న బాధ అయితే బీసీలలో ఉంది. ఇక టీడీపీలోనూ జనసేనలోనూ బీసీలు కాపులు ఈ సీటు మీద కన్నేశారు.
అశోక్ గజపతిరాజు రాజకీయ విరమణ ప్రకటించడంతో ఈ దఫా కుమార్తెకు సీటు దక్కింది. మరోసారి టికెట్ తెచ్చుకోవాలంటే ఆమె పనితీరే కొలమానంగా ఉండబోతోంది అని అంటున్నారు. మరి ఎమ్మెల్యే తన విధానాలను మార్చుకుని జనంతో మమేకం అయితే తండ్రి తాతల మాదిరిగా పది కాలాల పాటు రాజకీయాల్లోనూ ప్రజా ప్రతినిధిగానూ ఉంటూ మంచి పేరు తెచ్చుకుంటారు అని అంటున్నారు ఇక స్వపక్షంలోనూ అదే మాట వినిపిస్తోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
Social Plugin