Hot Posts

6/recent/ticker-posts

కొత్త ఉపరాష్ట్రపతి ఎంపిక వేళ టీడీపీకి బిగ్ ఆఫర్, చంద్రబాబు ఛాయిస్..!!


ANDHRAPRADESH:ఏపీ కేంద్రంగా జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉప రాష్ట్రపతి గా కొత్త వ్యక్తి ఎంపిక పైన కేంద్రంలోని ముఖ్య నేతలు కసరత్తు చేస్తున్నారు. జగదీప్ ధన్కర్ తన పదవికి రాజీనామా చేయటంతో కొత్త చర్చ మొదలైంది. కాగా, నూతన ఉపరాష్ట్రపతి ఎంపికలో ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వెంటనే ఈ పదవి భర్తీ చేయాలనే నిర్ణయంతో భాగంగా మిత్రపక్షాల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఈ కసరత్తులో భాగంగా టీడీపీకి ఢిల్లీ నుంచి బిగ్ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ఇప్పుడు చంద్రబాబు నిర్ణయం కీలకంగా మారనుంది.

కసరత్తు షురూ

కొత్త ఉపరాష్ట్రపతి ఎంపిక పైన కేంద్ర నాయకత్వం కసరత్తు ప్రారంభించింది. గతంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎంపిక వేళ మోదీ- షా ద్వయం వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రపతిగా మహిళ ఉండటంతో.. ఏ ప్రాంతానికి ఉప రాష్ట్రపతి పదవి ఇస్తారనే చర్చ మొదలైంది. అయితే త్వరలో బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. అదే విధంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు లో వచ్చే ఏడాది జరిగే ఎన్నికలు బీజేపీకి కీలకంగా మారుతున్నాయి. దీంతో.. బీహార్ నుంచి ఉప రాష్ట్రపతిని ఎంపిక చేస్తారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ గా ఉన్న జనతాదళ్‌ (యునైటెడ్‌) ఎంపీ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ రాష్ట్రపతిని కలిసారు.

ఛాన్స్ దక్కేదెవరికి

బీహార్ సీఎం నితీశ్ కుమార్ కాబోయే ఉప రాష్ట్రపతి అంటూ ప్రచారం సాగుతున్న అందుకు ఆయన సుముఖంగా లేరని తెలుస్తోంది. దీంతో.. ప్రస్తుతం బీహార్ కు అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయితే హరివంశ్ నారాయణ సింగ్ కు పదోన్నతి కల్పించి ఉప రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో దక్షిణాదికి ఇవ్వాలని భావిస్తే బీజేపీకి అనుకూలంగా మారిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పేరు పైన చర్చ జరుగుతోంది. అదే విధంగా జమ్ము కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా లేదంటే ఢిల్లీ ఎల్జీ సక్సేనాలో ఎవరికో ఒకరికి అవకాశం ఇవ్వను న్నట్లు ప్రభుత్వ వర్గాల్లో తీవ్రంగా చర్చ నడుస్తోంది. రెండు, మూడు రోజుల్లోనే ఈ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ జారీ కానుంది.

నితీశ్ - చంద్రబాబు ఛాయిస్

దీంతో, దాదాపుగా నితీశ్ ఛాయిస్ మేరకు ఉప రాష్ట్రపతి ఖరారు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక.. నితీశ్ పార్టీకి ఉప రాష్ట్రపతి హోదా దక్కితే.. ఎన్డీఏలో మరో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీకి మరో ప్రధాన పదవి ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ పదవి టీడీపీకి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణాదికి డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అయితే, టీడీపీ నుంచి గెలిచిన 16 మంది ఎంపీల్లో ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. మిగిలిన వారిలో డిప్యూటీ స్పీకర్ పదవి స్వీకరించేందుకు సీఎం చంద్రబాబు ఎవరికి అవకాశం ఇస్తారనేది కీలకంగా మారుతోంది. గతంలో టీడీపీ నుంచి బాలయోగి స్పీకర్ గా పని చేసారు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవి తిరిగి టీడీపీ నుంచి నిర్వహించే సమర్ధత ఎవరికి ఉందీ.. సామాజిక - ప్రాంతీయ లెక్కల్లో ఎవరిని వరిస్తుందనేది పార్టీలో చర్చగా మారింది. దీంతో, చంద్రబాబు ఆలోచన ఏంటి.. ఏం జరగనుందనేది మరో రెండు రోజుల్లో పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది