ANDHRAPRADESH:ఏపీలో కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించి డిప్యూటీ సీఎం కూడా అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి నారా లోకేష్ ఏ చిన్న అవకాశం దొరికినా ఆకాశానికెత్తేస్తున్నారు. అన్నా అన్నా అంటూ పవన్ ను సంభోధిస్తూ అత్యంత దగ్గరగా కనిపిస్తున్నారు. తెర వెనుక రాజకీయాలు ఉన్నా లేకున్నా బయటికి మాత్రం పవన్ పై లోకేష్ కురిపిస్తున్న అవాజ్య ప్రేమ ఇరువురి అభిమానుల్లో సైతం సంతోషం నింపుతోంది.
పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం హరి హర వీరమల్లు రేపు విడుదలకు సిద్దమైంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు ఏపీ మంత్రులతో పాటు సినీ పరిశ్రమలో పలువురు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఇదే క్రమంలో వైసీపీ నేత అంబటి రాంబాబు సైతం సినిమా సూపర్ డూపర్ హిట్టే అంటూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత మంత్రి నారా లోకేష్ కూడా పవన్ సినిమా హరి హర వీరమల్లుపై ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇందులో పవన్ పై ఆయన అభిమానం మరోసారి కనిపించింది.
మా పవన్ అన్న సినిమా #HariHaraVeeraMallu విడుదల సందర్భంగా సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న బృందానికి అభినందనలు అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. పవర్ స్టార్ అభిమానుల్లాగే తాను సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నానని లోకేష్ తెలిపారు. పవనన్న, ఆయన సినిమాలు, ఆయన స్వాగ్ తనకు చాలా చాలా ఇష్టమన్నారు. పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో 'హరిహర వీరమల్లు' అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ లోకేష్ తన ట్వీట్ ముగించారు
పవన్ హరిహర వీరమల్లు చిత్రానికి టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతించడంతో పాటు గతంలో షూటింగ్ విషయంలోనూ ప్రభుత్వం ఆయనకు పూర్తి సహాయసహకారాలు అందించింది. ఇప్పుడు కూటమి పార్టీల నేతలు కూడా పవన్ చిత్రానికి మద్దతుగా ట్వీట్లు, వ్యాఖ్యలు చేస్తూ ప్రమోట్ చేస్తున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో చిత్ర పరిశ్రమతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ప్రేక్షకులు సైతం రేపు రిలీజ్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Social Plugin