Hot Posts

6/recent/ticker-posts

రాష్ట్రానికి కేంద్రం సువర్ణావకాశం.. కానీ రేవంత్ సర్కార్ ఫెయిల్!


HYDERABAD:దేశవ్యాప్తంగా అన్నివర్గాల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలను అందిస్తోంది.కేంద్రప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందాలని ప్రజలకు సూచిస్తోంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాలను అమలు చేయాలని కేంద్రం పదేపదే చెబుతోంది. కేంద్రప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలోని ప్రతి ఒక్కరికి చేరాలని పదేపదే కోరుతున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కేంద్రప్రభుత్వ పథకాలు అమలులో ఫెయిల్ అవుతున్నాయని సాక్షాత్తు కేంద్రమంత్రి చెప్పడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుంది.

ప్రధానమంత్రి కుసుమ్ స్కీం పథకం

మార్చి 2019లో రైతులకు సౌర విద్యుత్తు పంపులను అందించడానికి గ్రిడ్ తో అనుసంధానించే సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి కుసుమ్ స్కీం ప్రారంభమైంది. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ పథకం రైతాంగానికి మేలు చేకూర్చడానికి ముఖ్యంగా రైతులకు ఇంధన భద్రతను అందించడానికి, డీజిల్ వినియోగాన్ని తగ్గించడానికి వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేయడానికి నిర్దేశింపబడింది.

ఈ స్కీం అమలులో తెలంగాణా ప్రభుత్వం ఫెయిల్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ఈ పథకం ద్వారా రైతులకు విద్యుత్ ఖర్చును తగ్గించి, ఆదాయాన్ని పెంచి, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించాలని కేంద్రం భావించింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయడానికి సంకల్పించింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకం అమలులో రేవంత్ సర్కార్ విఫలమైందని తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో సౌర విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని, కానీ దీనిని అమలు చేయడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందన్నారు.

రేవంత్ రెడ్డి ఇప్పటికైనా చొరవ చూపాలన్న కేంద్ర మంత్రి

రాష్ట్రంలోని రైతాంగానికి లబ్ధి చేకూర్చే ఈ స్కీంను ఇప్పటికైనా అమలు చేయాలని కోరారు. 2026 సంవత్సరంలో ఈ స్కీం ముఖ్యం ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవచూపి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విషయంలో ముందుకు రావాలన్నారు. వ్యవసాయరంగంలో సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు, రైతులపై విద్యుత్ భారం పడకుండా ఉంటుందని, ఈ పనిలో రాష్ట్ర ప్రభుత్వం కలిసి రావాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచించారు.

రాష్ట్రానికి కేంద్రం సువర్ణావకాశం

రాష్ట్రానికి డి సెంట్రలైజ్డ్ గ్రిడ్ అనుసంధానిత సౌర విద్యుత్ ప్లాంట్ల కోసం అదనంగా 450 మెగావాట్ల సామర్థ్యానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 20 వేల సోలార్ అగ్రికల్చర్ పంపుసెట్లను కేటాయిస్తున్నట్లు కేంద్ర రెన్యూవబుల్ ఎనర్జీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు చెబుతూ రాష్ట్రానికి కేంద్రం సువర్ణావకాశం ఇస్తుందని, కానీ రేవంత్ సర్కార్ దానిని వాడుకోవడంలో ఫెయిల్ అవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఈ పథకం అమలు పైన దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.