Hot Posts

6/recent/ticker-posts

మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్.. ఐటీ సోదాలు !


HYDERABAD:తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి ఆదాయ పన్ను అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన ఇంటితో పాటు కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలల సీట్ల కేటాయింపులో భారీగా డొనేషన్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలతో ఈ తనిఖీలు జరుగుతున్నాయని సమాచారం. అలానే మేనేజ్‌మెంట్ కోటాలో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును మించి విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసినట్లు పలు ఫిర్యాదులు అందినట్టు చెబుతున్నారు.

విద్యార్థుల నుంచి డొనేషన్ల పేరుతో వచ్చిన ఆదాయాన్ని సరిగా చూపకపోవడం.. ఆదాయ పన్నులో హెచ్చుతగ్గులను గుర్తించడం వంటి అంశాలపై ఐటీ అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి కుటుంబానికి చెందిన పలు ప్రాపర్టీల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఆయన కోడలు ప్రీతి రెడ్డి, కొడుకు భద్రారెడ్డి నివాసాల్లో ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు.

అయితే ఈ సోదాలపై అధికారిక సమాచారం ఇంకా బయటకు రావాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని ప్రదేశాల్లో కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. మల్లారెడ్డి కుటుంబానికి చెందిన విద్యాసంస్థల్లో నిధుల లావాదేవీలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారని అంటున్నారు. కాగా గతంలో కూడా మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లు, ఆఫీసు లలో సోదాలు జరిగిన విషయం తెలిసిందే.