ANDHRAPRADESH:ఏపీ మంత్రివర్గ ప్రక్షాళన ఖాయంగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 13 నెలల పాలన పూర్తి చేసుకుంది. పలువురు మంత్రుల పని తీరు పైన ముఖ్యమంత్రి చంద్రబాబు సంతృప్తి గా లేరు. ఇదే విషయాన్ని ప్రతీ మంత్రివర్గ భేటీలో చెబుతూ వచ్చారు. పని తీరు మెరుగు పడకుంటే ఇక రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనని హెచ్చరించారు. అయినా.. కొందరు మంత్రుల తీరులో మార్పు రావటం లేదు. దీంతో, మంత్రివర్గ ప్రక్షాళనకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముహూర్తం సైతం ఖరారు అయినట్లు కూటమి నేతల్లో ప్రచారం సాగుతోంది.
భారీ ప్రక్షాళన
ఏపీ మంత్రివర్గ ప్రక్షాళనకు ముమూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. పలు మార్లు హెచ్చరించినా పలువురు మంత్రుల తీరులో మార్పు లేకపోవటం.. రాజకీయంగా మారుతున్న సమీకరణాలు.. మంత్రుల పని తీరు ఆధారంగా ప్రక్షాళనకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఒకే సారి ఏకంగా ఆరు నుంచి ఎనిమిది మంత్రుల వరకు మార్పు ఖాయమని చెబుతున్నారు. మరి కొందరి శాఖల మార్పు పైన కసరత్తు కొనసాగుతోంది. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవటం పైన పవన్ తన తుది నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. అదే విధంగా బీజేపీ సైతం తమకు మరో మంత్రి పదవి ఇవ్వాలని ప్రతిపాదన చేసింది. మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇస్తూ.. సీనియర్ల సంఖ్య పెంచుతూ ఈ సారి ప్రక్షాళన కసరత్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ముహూర్తం ఖరారు
ఆగస్టు 8 నుంచి 15 వ తేదీ లోగా ప్రక్షాళన ఉంటుందని సమాచారం. ఇక, ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామ రాజును మంత్రివర్గంలోకి తీసుకుంటారని పార్టీ నేతల సమాచారం. డిప్యూటీ స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఛాన్స్ దక్కనుందని అంచనా వేస్తున్నారు. అదే విధంగా జనసేన నుంచి మంత్రిగా ఉన్న దుర్గేశ్ ను తప్పిస్తారనే చర్చ జరుగు తోంది. నాగబాబు తో పాటుగా జనసేన నుంచి కొణతాల పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుత మంత్రుల్లో ఉత్తరాంధ్ర కు చెందిన ముగ్గురిని తప్పించటం పైన పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. వారి స్థానంలో పల్లా శ్రీనివాస్, కొణతాల, కళా వెంకటరావు పేర్లు వినిపిస్తున్నాయి. అదే విధంగా గోదావరి జిల్లాల నుంచి సుభాష్ ను తప్పించే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం నెల్లూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక మంత్రిని తప్పించే ఛాన్స్ ఉందని సమాచారం.
ఇన్ - అవుట్
నెల్లూరు నుంచి ప్రశాంతి రెడ్డికి అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. వెంకటరాజుకు మంత్రిగా అవకాశం దక్కనుందని తెలుస్తోంది. ఇక, సీమకు చెందిన మంత్రిని తప్పిస్తారని..ఆ స్థానంలో నల్లారి కిశోర్ కుమార్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారని భావిస్తున్నారు. క్రిష్ణా జిల్లా నుంచి ఒక మంత్రి పైన వేటు పడనుందని ప్రచారం సాగుతోంది. కాగా, మరి కొందరి శాఖల్లో మాత్రం మార్పులు ఉంటాయి అని చెబుతున్నారు. జగన్ జిల్లాల పర్యటన.. వరుస వివాదాల సమయంలో మంత్రులు సరిగ్గా స్పందించలేదనే అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నారు. త్వరలో జగన్ పూర్తి స్థాయిలో జిల్లాల పర్యటనలకు.. ఆ తరువాత పాదయాత్రకు సిద్దం అవుతున్నారు. అయితే, సామాజిక - ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా తుది నిర్ణయాలు జరగనున్నాయి. దీంతో.. ఇక మంత్రివర్గంలో మార్పు తో పాటుగా పార్టీలోనూ కీలక నిర్ణయాలకు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది.
Social Plugin