ANDHRAPRADESH:ఏపీ రాజకీయాల్లో వైసీపీ నేత అంబటి రాంబాబుకూ, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఉన్న వైరం తెలిసిందే. పవన్ ఏ విషయంపై మాట్లాడినా దానికి కౌంటర్లు ఇవ్వడంలో ముందుండే రాజకీయ ప్రత్యర్థి నేతల్లో అంబటి రాంబాబు కూడా ఒకరు. అలాంటి అంబటి రాంబాబు.. ఉన్నట్లుండి పవన్ కు ఊరట కల్పించేలా వ్యాఖ్యలు చేస్తే, ఆయన సినిమా హిట్ అంటూ ట్వీట్ చేస్తే.. ఇవాళ ఆ అద్బుతమే జరిగింది.
పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. సుదీర్ఘ విరామం తర్వాత విడుదలవుతున్న పవన్ కళ్యాణ్ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో హరిహర వీరమల్లు చిత్రంపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. అదీ అలాంటి ఇలాంటి ట్వీట్ కాదు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలంటూ అంబటి ట్వీట్ చేశారు.
గతంలో పవన్ విపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనపై ఒంటికాలితో లేచే అంబటి రాంబాబు ఇలా తొలిసారి ఆయన సినిమా హిట్ కావాలని కోరుకుంటూ ట్వీట్ పెట్టడం ఆయన సొంత పార్టీ వైసీపీ నేతలకు మాత్రం ఆశ్చర్యం కలిగించింది. అయితే రాజకీయాలకూ, సినిమాలకూ లింక్ లేదని, అందుకే అంబటి ఇలా తన అభిమాన హీరో చిత్రం హిట్ కావాలంటూ ట్వీట్ చేశారని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు.

Social Plugin