Hot Posts

6/recent/ticker-posts

ఇళ్లకు స్మార్ట్ మీటర్లపై ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..! మంత్రి కీలక ప్రకటన..!


ANDHRPRADESH:ఏపీలో ఇళ్లకు విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. స్మార్ట్ మీటర్ల బిగింపుతో ఎక్కువ బిల్లులు వచ్చే అవకాశం ఉందని, వాడినా వాడకపోయినా బిల్లులు పడతాయనే భావన సాధారణ ప్రజల్లో ఉంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ మీటర్లు బిగించేందుకు ఇళ్లకు వస్తున్న విద్యుత్ శాఖ సిబ్బందిని పలు చోట్ల అడ్డుకుంటున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇవాళ విశాఖపట్నంలో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రజల అంగీకారం లేకుండా స్మార్ట్ మీటర్లు బిగించవద్దని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. పారిశ్రామిక, వ్యాపార సంస్థలకు మాత్రమే స్మార్ట్ మీటర్లు బిగించాలని సూచించారు. వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు బిగించేది లేదని కూడా మరోసారి స్పష్టం చేశారు.

స్మార్ట్ మీటర్లపై సోషల్ మీడియాలో కొందరు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని, స్మార్ట్ మీటర్ల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారుల్ని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. గృహాలకు స్మార్ట్ మీటర్లు బిగించే ముందు చెక్ మీటర్లతో ప్రజల సందేహాలు నివృతి చేయాలని మంత్రి సూచించారు. ప్రజలకు ఆమోదం లేనిదే ఏ విషయం మీద కూడా ముందుకు వెళ్లేది లేదని మరోసారి వెల్లడించారు.

మరోవైపు విద్యుత్ సరఫరాలో అవరోధాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి గొట్టిపాటి.. ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో లో ఓల్టేజ్ సమస్యలను పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు. ఆర్.డీ.ఎస్.ఎస్ పనులను వేగవంతం చేయాలని సీఎండీ పృథ్వితేజను ఆదేశించారు. ఇందుకోసం స్థానిక కాంట్రాక్టర్ల సాయం తీసుకోవాలని మంత్రి సూచించారు.ఆర్.డీ.ఎస్.ఎస్ పనులు తొలిదశ పూర్తి అయితే కానీ రెండో దశకు నిధులు కోరలేమని అధికారులకు మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. అలాగే పీఎం సూర్యఘర్ పై కూడా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ప్రతీ నియోజకవర్గంలో 10 వేల పీఎం సూర్యఘర్ కనెక్షన్లు అందించాలని ఆదేశించారు.