Hot Posts

6/recent/ticker-posts

ఒత్తిళ్లకు లొంగి ఆపరేషన్ సిందూర్ ఆపలేదన్న రాజ్ నాథ్.. ! తీవ్రవాదుల్ని ఎందుకు పట్టుకోలేదన్న కాంగ్రెస్..!

ANDHRAPRADESH:కాశ్మీర్ లో పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై ఇవాళ లోక్ సభలో చర్చ మొదలైంది. ముందుగా ఆపరేషన్ సింధూర్ చేయడానికి గల కారణం, అందులో పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల్ని ఆర్మీ మట్టుబెట్టిన తీరు, ఆ తర్వాత సీజ్ ఫైర్ కు దారి తీసిన పరిస్ధితుల్ని వివరించారు. ఆపరేషన్ సిందూర్ ను ఏ ఒత్తిడికి లొంగీ ఆపలేదన్నారు. అనంతరం మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్.. కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు. ఆ ఉగ్రవాదుల్ని ఇంకా ఎందుకు పట్టుకోలేదని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు.

గతంలో యూరీ, పుల్వామా దాడుల తర్వాత సరిహద్దుల్లో తీవ్రవాద మౌలిక సౌకర్యాలను పూర్తిగా ధ్వంసం చేశామని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇవాళ తెలిపారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ స్పందిస్తూ.. మరి పహల్గాంలో తీవ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పాలని నిలదీశారు. అలాగే పాకిస్తాన్ పై యుద్దం చేయాలని తాము అనుకోవడం లేదని రాజ్ నాథ్ సింగ్ చెప్పగా..ఎందుకు అనుకోవడం లేదో చెప్పాలని మళ్లీ గగోయ్ సూటిగా ప్రశ్నించారు.

గతంలో పుల్వామా దాడి జరిగినప్పుడు కూడా ఘుస్ కే మారేంగే (పాకిస్తాన్ లోకి చొరబడి కొడతాం) అంటూ ప్రధాని మోడీ చెప్పారని, ఇప్పుడు పహల్గాం దాడి తర్వాత కూడా అదే చెప్తున్నారని గౌరవ్ గగోయ్ ఎద్దేవా చేశారు. ఇవాళ్టికీ రాజ్‌నాథ్ సింగ్ ఆపరేషన్ సిందూర్ కు బ్రేక్ ఇచ్చామని, ఆగలేదని చెబుతున్నారని ఆయన గుర్తుచేసారు. పాకిస్తాన్ మళ్ళీ దాడి చేస్తే, తాము స్పందిస్తామని అంటున్నారని, ఓవైపు ఉగ్రవాద మౌలిక సదుపాయాలు కూల్చేశామని చెప్పుకుంటున్నారని, మరోవైపు ఉగ్రవాద దాడి మళ్ళీ జరగవచ్చని చెప్తున్నారని గగోయ్ ఆక్షేపించారు.

రాజ్ నాథ్ సింగ్ తన ప్రసంగంలో చాలా విషయాలు చెప్పారని, కానీ తీవ్రవాదులు పహల్గాంలోకి ఎలా చొరబడ్డారో, 26 మంది ప్రాణాలు ఎలా తీశారో చెప్పడం లేదని గగోయ్ ఆరోపించారు. పహల్గాం దాడి జరిగి 100 రోజులు దాటి పోయిందని, కానీ ఇప్పటికీ ఆ దాడికి పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదుల్ని పట్టుకోలేదన్నారు. మనకు డ్రోన్స్, పెగాసస్, శాటిలైట్లు, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ ఉన్నాయని, రక్షణ మంత్రి తాజాగా పహల్గాంలో పర్యటించారని, అయినా ఉగ్రవాదుల్ని పట్టుకోలేదన్నారు.