HYDERABAD:తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి ఏపీ రాజధాని అమరావతిలో భాగమైన విజయవాడ నగరానికి రాకపోకలు సాగించే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ ఇవాళ గుడ్ న్యూస్ ప్రకటించింది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు వివిధ బస్సుల్లో భారీ డిస్కౌంట్ లు ప్రకటించింది. ఈ ఆఫర్ లు ఏయే బస్సుల్లో ఎంతెంత వర్తిస్తాయన్న వివరాలను టీజీఎస్ ఆర్టీసీ అధికారులు ఎక్స్ లో ట్వీట్ చేశారు.
హైదరాబాద్-విజయవాడ రూటులో ప్రయాణికుల కోసం ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ ప్రకటిస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) ఇవాళ ఎక్స్ లో పోస్టు పెట్టింది. ఇందులో హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రయాణికులకు టికెట్లలో భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించింది. అలాగే టికెట్లు అధికారిక వెబ్ సైట్ https://www.tgsrtcbus.in/ లో బుక్ చేసుకోవాలని ఇరు నగరాల మధ్య ప్రయాణికుల్ని ఆర్టీసీ కోరింది.
తెలంగాణ ఆర్టీసీ ప్రకటించిన వివరాల ప్రకారం హైదారాబాద్- విజయవాడ నగరాల మధ్య నడిచే గరుడ ప్లస్ బస్సుల్లో 30 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అలాగే ఈ-గరుడ బస్సుల్లో 26 శాతం డిస్కౌంట్ ను ఆఫర్ చేసింది. అలాగే సూపర్ లగ్జరీ, లహరి నాన్-ఏసీ బస్సుల్లో 20 శాతం టికెట్ రేట్లపై రాయితీ ఇస్తోంది. చివరిగా రాజధాని, లహరి ఏసీ బస్సుల్లో టికెట్లపై 16 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఏసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ తగ్గింది. దీంతో పాటు నాన్ ఏసీ బస్సుల్లోనూ ప్రయాణాల సంఖ్య తగ్గుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ఇలా భారీ డిస్కౌంట్ లతో ప్రయాణికుల్ని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే ఏపీఎస్ ఆర్టీసీ నుంచి ఎదురవుతున్న గట్టి పోటీ కూడా ఈ డిస్కౌంట్ ప్రకటన వెనుక మరో కారణంగా తెలుస్తోంది. ఏదేమైనా తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీల పోటీతో ప్రయాణికులకు మాత్రం డిస్కౌంట్ ల పంట పండుతోంది. ముఖ్యంగా వర్షాకాలం సీజన్ లో ఈ ఆఫర్లు తెలంగాణ ఆర్టీసీని ఏ మేరకు గట్టెక్కిస్తాయో చూడాలి మరి.
Social Plugin