ANDHRAPRADESH:మాజీ మంత్రులు విడదల రజిని, అంబటి రాంబాబు నేడు సత్తెనపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో అంబటి రాంబాబును పోలీసులు ప్రశ్నించారు. అలాగే, జగన్ పర్యటన సమయంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు విడదల రజినిని కూడా విచారించారు.
తాము ఎన్నడూ కక్ష సాధింపు చర్యలకు దిగలేదు: అంబటి రాంబాబు
సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణ అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. విచారణలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు తాము సమాధానం చెప్పామని ఆయన తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు హాజరుకావడం సిగ్గుగా ఉందని, దేనికైనా సిద్ధపడి రాజకీయాలు చేస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ కేబినెట్‌లో మంత్రులుగా పనిచేసినప్పటికీ తాము ఎన్నడూ కక్ష సాధింపు చర్యలకు దిగలేదన్నారు. చంద్రబాబు, లోకేష్ మాత్రం తమపై కక్షపూరితంగా కేసులు పెట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.
వైసీపీ నేతలందరిపై కేసులు పెట్టి లోపల వేయాలని చూస్తోంది
కూటమి ప్రభుత్వం తమను కావాలని ఇబ్బంది పెడుతోందని, వైసీపీ నేతలందరిపై కేసులు పెట్టి లోపల వేయాలని ఈ ప్రభుత్వం చూస్తోందని ఆయన అన్నారు. జగన్ పార్టీ పెట్టినప్పటి నుండి ఆయన వెంటే తాము ఉన్నామని పేర్కొని ఎప్పటికీ జగన్ వెంటే ఉంటామన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి కేసులు తమపై లేవని, తమను వేధించేందుకే ఇలా కేసులు పెడుతున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమ అరెస్ట్ చేశారు
ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారని, ఆయనది అక్రమ అరెస్ట్ అన్నారు. రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా సాగుతుందో ప్రజలు ఆలోచించాలని అంబటి రాంబాబు కోరారు. సత్తెనపల్లి శాసనసభ్యుడు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంట్రాక్టర్ దగ్గర చేతులు కట్టుకొని నిలబడుతున్నారని, ఆ కాంట్రాక్టర్ వివాదాల్లో ఉన్న స్థలాలు కొని వెంచర్లు వేస్తున్నారని అంబటి ఆరోపించారు.
చంద్రబాబు, లోకేష్‌కు బుద్ధి చెప్పి తీరుతాం
లిక్కర్ స్కామ్‌లో చంద్రబాబు, లోకేష్, మంత్రులు, డీఎన్ఆర్ ఉన్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్‌కు బుద్ధి చెప్పి తీరుతామని అంబటి స్పష్టం చేశారు. ఇది మిలటరీ పాలన అని దుయ్యబట్టారు. దుష్టపాలన అంతానికి అందరం కలిసి పనిచేద్దామని అంబటి రాంబాబు పిలుపునిచ్చారు.
Social Plugin