Hot Posts

6/recent/ticker-posts

తెలంగాణలో భారీ చోరీ.. 18 కేజీల బంగారం, 22 లక్షల నగదు మాయం


HYDERABAD:తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో జరిగిన భారీ దోపిడీ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. స్థానికంగా ఉన్న ఎంజీ రోడ్డులోని 'సాయి సంతోషి జ్యూవెల్లర్స్‌' లో భారీ దోపిడీ జరిగింది. పక్కా ప్రణాళికతో చోరీకి పాల్పడిన దొంగల ముఠా.. ఏకంగా 18 కేజీల బంగారం.. రూ.22 లక్షల నగదును దోచుకెళ్లారు.

చోరీను ప్లాన్ చేసిన దొంగలు, ముందుగానే సీసీ కెమెరాలను డిస్‌ కనెక్ట్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. షాపు వెనుక భాగంలోని గోడకు రంధ్రం చేసి.. అనంతరం గ్యాస్ కట్టర్ సాయంతో షట్టర్‌ను మనిషి దూకేంత వరకు కట్ చేసి లోపలికి ప్రవేశించారని తెలిపారు. అలానే స్ట్రాంగ్ రూమ్‌లో ఉన్న భారీ ఐరన్ తిజోరీని సైతం గ్యాస్ కట్టర్‌తో తెరిచి.. అందులో ఉన్న బంగారాన్ని దోచుకెళ్లారన్నారు.

అయితే వెండి, ఇతర వస్తువులను ముట్టుకోకుండా కేవలం బంగారాన్ని తీసుకెళ్లినట్టు సమాచారం. దాదాపు రూ.17 కోట్ల విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లిన ఈ చోరీ పక్కా మాస్టర్ ప్లాన్‌తో సాగిందని పోలీసులు స్పష్టం చేశారు.

ఈ చోరీ ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరగగా.. శనివారం షాపు మూసి ఉండడం, ఆదివారం సెలవు కావడంతో.. తిరిగి సోమవారం ఉదయం షాపు తెరిచి చూడగా విషయం వెలుగులోకి వచ్చినట్టు చెబుతున్నారు. స్ట్రాంగ్‌రూమ్ గోడకు రంధ్రం వేసి ఉండడం.. షాపులో ఫర్నిచర్, మొత్తం వస్తువులను కదిలించినట్టు షాపు యజమాని తెడ్ల కిషోర్ వాపోయారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే డీఎస్పీ ప్రసన్న కుమార్ నేతృత్వంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌లను రంగంలోకి దించారు. ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

ఇక మరోవైపు తెలంగాణలో కూడా ఈ తరహా దొంగతనాలు వరుసగా జరుగుతున్నాయి. ఫిబ్రవరిలో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని 'కోహినూర్ జ్యూవెల్లర్స్‌'లో సుమారు రూ.15 కోట్ల విలువైన వజ్రాభరణాలను అపహరించారు. అలానే మార్చిలో నాగర్‌కర్నూల్ జిల్లాలో ATMను గ్యాస్ కట్టర్‌తో తెరిచి రూ.50 లక్షల నగదు దోచుకెళ్లారు. దీంతో ఈ వరుస దొంగతనాల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.