ANDHRAPRADESH:నేటి సమాజంలో చోటు చేసుకుంటున్న పలు ఘటనలు చూస్తుంటే సభ్య సమాజం సైతం తల దించుకునేలా ఉన్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు మగాళ్లు.. మృగాళ్లుగా మారుతున్నారని అనడానికి ఈ దారుణ ఘటనే మరో ఉదాహరణ అని చెప్పాలి. అరవై ఏళ్ల వృద్ధుడు ఏడాదిగా ఓ యువతిని బెదిరిస్తూ.. అత్యాచారానికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో వెలుగు లోకి వచ్చింది. దీంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
కల్లూరు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు.. మండలానికి చెందిన 22 ఏళ్ల యువతి చదువు మధ్యలోనే ఆపేసి ఇంటి వద్దే ఉంటుంది. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిన సమయంలో.. అదే గ్రామానికి చెందిన వరుసకు మామ అయ్యే 60 ఏళ్ల వృద్ధుడు యువతిని కత్తితో బెదిరించి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏడాది కిందట ఈ దారుణం జరగగా.. నాటి నుంచి పలుమార్లు అలానే బెదిరిస్తూ అఘాయిత్యానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది.
అయితే ఈ విషయం తన తల్లిదండ్రులకు చెబుతానని యువతి ఎదురు తిరగడంతో.. ఆమె తండ్రిని సైతం మద్యంలో విషం కలిపి చంపుతానని బెదిరించినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొన్నట్టు వివరించారు. ఈ క్రమంలోనే ఈ నెల 13న యువతి తన తమ్ముడితో కలిసి వెళ్తుండగా మళ్లీ బెదిరింపులకు పాల్పడ్డాడు.
ఆ తర్వాత యువతి మెడలో దారం వేసి ఫొటో దిగి.. దాంతో పెళ్లయినట్లు ఆమెను ఇబ్బందులకు గురి చేయడం ప్రారంభించాడు. ఇక అతని బాధను భరించలేక యువతి తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పింది. దీంతో వారు వెంటనే తమకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. వృద్ధుడిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేసినట్టు తెలిపారు.
మరోవైపు ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "60 ఏళ్ల వయసులో కూడా ఇటువంటి నీచ చర్యలకు పాల్పడడం పట్ల మండిపడుతున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. సామాజిక కార్యకర్తలు, మహిళా సంఘాలు యువతికి మద్దతుగా నిలుస్తున్నారు.
Social Plugin