Hot Posts

6/recent/ticker-posts

ఢిల్లీకి మాజీ సీఎం జగన్- మారుతున్న లెక్కలు..!!


ANDHRAPRADESH:ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. లిక్కర్ కేసు రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు వైసీపీ నేతలను అరెస్ట్ చేసారు. తాజాగా సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో మాజీ ముఖ్యమంత్రి అంతిమ లబ్దిదారుగా తేల్చారు. ఇతర కేసుల్లో నూ వైసీపీ నేతలు చిక్కుకున్నారు. ఈ సమయంలో మాజీ సీఎం జగన్ పార్టీ ముఖ్య నేతలతో కీలక మంత్రాంగం చేసారు. ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

జగన్ కసరత్తు 

వైసీపీ నేతలు వరుస కేసుల్లో చిక్కుకుంటున్నారు. లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ తరువాత ఒక్క సారిగా వాతావరణం హీటెక్కింది. ఇదే సమయంలో ఛార్జ్ షీట్ లో అంతిమ లబ్ది దారుగా జగన్ గురించి ప్రస్తావనతో ఉత్కంఠ పెరుగుతోంది. లిక్కర్ స్కాం అసలు జరగలేదని.. సీఎంఓ లో ఎలాంటి చర్చ.. నిర్ణయాలు లేవని గతంలోనే జగన్ స్పష్టం చేసారు. తన పరామర్శల పర్యటనల వేళ చోటు చేసుకున్న పరిణామాలు.. వరుస కేసుల పైన జగన్ సీరియస్ గా ఉన్నారు. లిక్కర్ చార్జ్ షీట్.. పార్టీ నేతల పైన కేసుల అంశం పైన జగన్ సీనియర్ న్యాయ వాదులతో చర్చ లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పార్టీ ముఖ్య నేతలతోనూ సమీక్షించారు.

ఢిల్లీలో ఫిర్యాదులు 

మిథున్ అరెస్ట్ ను జగన్ తప్పు బట్టారు. రాజకీయ నిర్ణయంగా పేర్కొన్నారు. ఏపీలో వరుసగా ఇలా వరుసగా కేసుల నమోదు పైన ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదులు చేయాలని ఆలోచన చేస్తున్నారు. తానే స్వయంగా వెళ్లి ఢిల్లీలో ఈ కేసుల గురించి వివరించే యోచనలో ఉన్నారు. అదే విధంగా ఢిల్లీ కేంద్రంగా తన అయిదేళ్ల కాలంతో పాటుగా 2014-19 మధ్య కాలంలో జరిగిన మద్యం లావా దేవీల గురించి వివరించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న ఈ సమయంలో వెళ్లాలనే అభిప్రాయం పార్టీ నేతల నుంచి వచ్చినట్లు సమాచారం. పార్లమెంట్ లోనూ ఏపీలో కేసుల వ్యవహారం పైన ప్రస్తావించాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అటు టీడీపీ నేతలు సైతం లిక్కర్ స్కాం పైన పార్లమెంట్ లో లేవెనెత్తుతామని చెబుతున్నారు.

న్యాయ పోరాటం

కాగా, ఏపీలో కేసుల గురించి జగన్ స్వయంగా వెళ్లాలా.. లేక, పార్టీ ఎంపీలతో పాటుగా సీనియర్ నేతలను పంపి ఫిర్యాదు చేయాలా అనే అంశం పైన చర్చ జరిగింది. కేంద్రంలోనూ టీడీపీ భాగస్వామిగా ఉండటంతో జగన్ ఈ ఫిర్యాదుల అంశం పైన రేపు నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం. అయితే, ముందుగా ఈ కేసుల విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలనే ఆలోచన పైన కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా సీనియర్ న్యాయవాదుల తో చర్చలు జరుపుతున్న జగన్.. న్యాయపోరాటానికి సిద్దం అవుతున్నారు. లిక్కర్ కేసుతో పాటుగా అన్ని అంశాల్లో ఎలాంటి పరిణామాలు ఎదురైనా న్యాయ పరంగా ఎదుర్కొంటూ.. ఇక, వరుసగా జిల్లాల్లో పార్టీ సమావేశాల్లో పాల్గొనేందుకు జగన్ సమాయత్తం అవుతున్నారు.