ఆ తర్వాత పర్యావరణ మదింపునకు అవసరమైన టీఓఆర్ ప్రతిపాదనలతో రావాలని పేర్కొంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ సమర్పించిన ప్రతిపాదనను వెనక్కి పంపుతున్నట్లు వివరించింది. జూన్ 17న ఈ కమిటీ సమావేశమై పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై చర్చించింది. ఈ మేరకు కమిటీ నిర్ణయాన్ని సోమవారం నాడు వెల్లడించింది.
పోలవరం- బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును రూ.81,900 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా ఇప్పటికే కేంద్ర జలసంఘానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. దీనిపై కేంద్ర జలసంఘం అధ్యయనం చేస్తోంది.
మరోవైపు ప్రాజెక్టును త్వరగా పట్టాలెక్కించేందుకు వీలుగా పర్యావరణ మదింపు ప్రక్రియ చేపట్టేందుకు అవసరమైన టీఓఆర్‌కు అనుమతి కోసం ప్రాథమిక నివేదికను కేంద్ర అటవీ పర్యావరణశాఖకు సైతం సమర్పించింది.
ఈ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేయడమే కాకుండా వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలకు ఫిర్యాదులు కూడా చేసింది. ప్రాజెక్టుకు కేంద్ర అటవీ పర్యావరణ అనుమతులు పొందాలంటే ముందు మదింపు ప్రక్రియ చేపట్టాలి.
ఇందుకు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ నుంచి టీఓఆర్‌కు అనుమతి తీసుకోవాలని ఏపీ జలవనరులశాఖ ఈ ప్రతిపాదనను కేంద్రం ముందుకు తీసుకువెళ్లింది. జూన్ 17న నిర్వహించిన నిపుణుల కమిటీ భేటీలో 33.1 ఎజెండా అంశంగా ఇది చర్చకు వచ్చింది.
కమిటీ ఛైర్మన్ జి.జె.చక్రపాణి అధ్యక్షతన, కేంద్ర అటవీ పర్యావరణశాఖ ఉన్నతాధికారి వై.పి.సింగ్ మెంబర్ సెక్రటరీగా ఉన్న కమిటీ ఈ ప్రతిపాదనను పరిశీలించింది. ఏపీ జలవనరులశాఖ అధికారులు ఆ కమిటీ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
అన్నీ పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకున్న కమిటీ ఈ ప్రాజెక్టు 1980 గోదావరి నీటి వివాదాల ట్రైబ్యునల్ అవార్డుకు వ్యతిరేకంగా ఉందని ఇప్పటికే అనేక ఫిర్యాదులు అందాయని తెలిపింది.
గోదావరిలో వరద జలాల లభ్యతపై కేంద్ర జలసంఘం సహకారంతో సరైన అధ్యయనం చేయాలని సిఫార్సు చేస్తున్నామని కమిటీ వెల్లడించింది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర జలసంఘాన్ని సంప్రదించాలని తెలిపిది.
ఆ సంఘం అంతర్రాష్ట్ర వివాదాలను పరిశీలించి అవసరమైన అనుమతులు మంజూరు చేసిన తర్వాత పర్యావరణ మదింపు కోసం అవసరమైన టీఓఆర్ రూపకల్పన ప్రతిపాదనను తమ ముందుకు తీసుకురావాలని కమిటీ పేర్కొంది.
గోదావరి బేసిన్‌లోని పోలవరం డ్యాం నుంచి నీటి లోటు ఉన్న బేసిన్‌కు వరద జలాలు మళ్లించేందుకు పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు చేపట్టాలని ప్రతిపాదించారన్న కమిటీ వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టుకు 2005 జనవరి 25న పర్యావరణ అనుమతులు మంజూరైనట్లు తెలిపింది.
ఈ ప్రాజెక్టు వల్ల ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ముంపు సమస్యలున్నందున ఈ ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల అంశమూ ఇంకా న్యాయస్థానం పరిధిలో ఉందని చెప్పింది. ఈ విషయాన్ని కూడా తాము పరిగణనలోకి తీసుకున్నామని కమిటీ పేర్కొంది.
Social Plugin