తాను రాజకీయాల్లోకి వచ్చింది ఉత్తమ సమాజం కోసం మంచి ప్రభుత్వం కోసం జవాబు దారీతనంతో పనిచేసే పాలన కోసమని చెప్పారు.
ANDHRAPRADESH:జేడీ లక్ష్మీనారాయణ అంటే అందరికీ తెలుస్తుంది. వీవీ లక్ష్మీనారాయణ అంటే తెలియదు. అంతలా తాను చేసిన ఉద్యోగం ద్వారా ఆయన గుర్తింపు సంపాదించారు. సీబీఐ జేడీగా పనిచేసిన ఆయనకు అదే ఇంటి పేరు అయింది. సినీ హీరోకు ఉండే పాపులారిటీ ఆ రోజులలో ఆయనకు ఉండేది. అటువంటి జేడీ తన వృత్తిపరంగా ఇంకా ఎక్కాల్సిన శిఖరాలు ఎన్నో ఉండగా మధ్యలో వదిలేసి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు. అసలు ఆయన జనసేనలో ఎందుకు చేరారు, ఎందుకు వదిలేశారు ఇవన్నీ చాలా మందికి ఇప్పటికీ వేధించే ప్రశ్నలు. వాటికి జేడీ ఒక ప్రముఖ టీవీ చానల్ పాడ్ కాస్టులో చాలా ఆసక్తికరమైన జవాబులు చెప్పారు.
అందుకే జనసేనకు దూరం
తాను రాజకీయాల్లోకి వచ్చింది ఉత్తమ సమాజం కోసం మంచి ప్రభుత్వం కోసం జవాబు దారీతనంతో పనిచేసే పాలన కోసమని చెప్పారు. అందుకే తన సర్వీసు ఎంతో ఉండగానే పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చాను అని చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ అదే సమయంలో సినిమాలు వదిలేసి సొంత పార్టీ పెట్టారు అన్నారు. ఇద్దరి లక్ష్యం ఒక్కటే. జీరో బేస్డ్ పాలిటిక్స్ అని అన్నారు. అందుకే చేయి కలిపామని అన్నారు. అయితే 2019లో పార్టీ ఓడాక పవన్ సినిమాలలోకి తిరిగి వెళ్ళారని అది నచ్చకనే తాను జనసేనకు దూరం అయ్యాను అన్నారు. రాజకీయాల్లో పూర్తిగా ఉంటేనే సీరియస్ నెస్ వస్తుందన్నది తన భావన అన్నారు.
ఎంపీగా అధికారంలో ఉండేవారా
ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కలసి పోటీ చేశాయి. పైగా జనసేనకు 21 అసెంబ్లీ సీట్లు రెండు ఎంపీ సీట్లు దక్కాయి. సెంట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేటు వచ్చింది. ఈ సమయంలో జేడీ కనుక పార్టీలో ఉంటే కచ్చితంగా ఎంపీ అయి ఉండేవారు కదా అన్న యాంకర్ ప్రశ్నకు ఆయన ఆయన బదులిస్తూ అధికారంలో ఉండలేనందుకు ఎలాంటి బాధ లేదని అన్నారు ప్రజా సమస్యలు పరిష్కారం కావాలన్నదే తన ఆలోచన అన్నారు. అందుకే తాను జై భారత్ పార్టీని స్థాపించి పోరాటం చేస్తున్నాను అన్నారు.
జగన్ ఓటమి వెనక ఈవీఎం
వైసీపీ 151 సీట్లతో 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి 2024 నాటికి కేవలం 11 సీట్లకు పరిమితం కావడం మీద జేడీ వ్యాఖ్యానిస్తూ జనాలు మార్పు కోరుకున్నారు అన్నారు. నవరత్నాలు ద్వారా సంక్షేమం అందించినా ఇంకా ఎక్కువ పధకాలు ఇస్తామని కూటమి చెప్పిందని గుర్తు చేశారు. మూడు పార్టీల కలయికతో బలం చేకూరిందని అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద జరిగిన చర్చ వైసీపీని బాగా దెబ్బ తీసిందని అన్నారు. అయిదేళ్ళ పాలనలో లా అండ్ ఆర్డర్ లేకపోవడం కూడా జనాలు గమనించారు అన్నారు. ఈవీఎంల పాత్ర ఏదీ ఓటమి వెనక లేదని అన్నారు. అయితే ఈవీఎంల విషయంలో విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న క్రమంలో ఆ సందేహాలు తీర్చాల్సిన బాధ్యత అయితే ఈసీ మీద ఉందని జేడీ అన్నారు.
కూటమి ఫోకస్ అటు వైపే
ఏపీలో టీడీపీ కూటమి పదనాలుగు నెలల పాలలో రెండు అంశాల మీద పూర్తిగా ఫోకస్ పెట్టినట్లుగా అర్ధం అవుతోందని జేడీ అన్నారు. అమరావతిని ప్రపంచ రాజధానిగా చేయడం పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడం మీద దృష్టి పెట్టారు అన్నారు. ఇంకా కూటమి పాలనను జనాలతో పాటు తామూ గమనిస్తున్నామని ప్రజల సమస్యలు పరిష్కారం కాకపోతే తమ పార్టీ తరఫున పోరాటం చేసేందుకు సిద్ధమని అన్నారు.
ఎన్నికల సంస్కరణలు రావాలి :
అవినీతిపరులు నేరగాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయకుండా పదునైన చట్టాలు రావాలని జేడీ అభిప్రాయపడ్డారు. ఈ రోజున పార్లమెంటులో దాదాపుగా 39 శాతం మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏపీ అసెంబ్లీలో 70 శాతం మంది మీద కేసులు ఉన్నాయని ఆయన చెప్పారు. ఒక రాజకీయ నాయకుడి మీద కేసు ఫైల్ అయిన వెంటనే పోటీకి అనర్హుడిని చేసేలా చట్టం రావాలని అన్నారు అలాగే నిర్బంధ ఓటింగ్ ని ప్రవేశపెట్టాలని, రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలని ఆయన కోరారు. అదే విధంగా సీట్ల బట్టి కాకుండా ఆయా రాజకీయ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం బట్టి అధికారంలో వాటా ఉండేలా విధానాలు తీసుకుని రావాలని కోరారు. మొత్తం మీద తాను రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఏనాడూ బాధపడలేదని ప్రజలకు సేవ చేయడానికి ఇది ఒక విశాల వేదికగా భావిస్తున్నాను అని జేడీ చెప్పారు.
Social Plugin