Hot Posts

6/recent/ticker-posts

రేపు హైకోర్టు ముందుకు పవన్ కేసు..! తీర్పుపై ఉత్కంఠ..!


ANDHRAPRADESH:ఏపీలో గతంలో వైసీపీ ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు సేకరించిన డేటా కారణంగా 30 వేల మంది అమ్మాయిలు అదృశ్యం అయ్యారంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సందర్భంగా సంచలన ఆరోపణలు చేశారు. అయితే వారి ఆచూకి గురించి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇంకా ఆయన మాట్లాడటం లేదు. మరోవైపు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై గతంలో గుంటూరు కోర్టులో దాఖలైన కేసును వెనక్కి తీసుకుంది. దీంతో ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది.

30 వేల మంది మహిళల మిస్సింగ్ పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తమ పరువుకు భంగం కలిగించాయంటూ వాలంటీర్లు చేసిన ఫిర్యాదు మేరకు గుంటూరు కోర్టులో క్రిమినల్ కేసు నమోదైంది. అయితే ప్రభుత్వం గతేడాది నవంబర్ లో దీన్ని ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలో వాలంటీర్లు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడా వారికి చుక్కెదురైంది. రిజిస్ట్రీ వీరి పిటిషన్ కు నంబర్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో వారు నేరుగా న్యాయమూర్తిని ఆశ్రయించడంతో నంబర్ కేటాయించారు.

ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణకు తేదీ నిర్ణయిస్తామని వెల్లడించిన హైకోర్టు.. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రేపు ఉదయం పదిన్నర గంటలకు వాలంటీర్లు పవన్ కళ్యాణ్ పై దాఖలు చేసిన పిటిషన్ ను రీఓపెన్ చేయడంతో పాటు విచారణ చేసేందుకు హైకోర్టు సిద్ధమవుతోంది. ఈ కేసులో హైకోర్టు ఇచ్చే తీర్పు పవన్ కు రాజకీయంగా చాలా కీలకం. ఎందుకంటే పవన్ చేసిన తీవ్ర ఆరోపణ వెనుక ఉన్న ఆధారాలు హైకోర్టు ముందుకు రావాల్సి ఉంటుంది.

అలా కాకపోతే పవన్ ఈ వ్యవహారంలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఆధారాలు లేకుండా పవన్ వ్యాఖ్యలు చేసినట్లు తేలితే హైకోర్టు ఆయనపై చర్యలు తీసుకునే అవకాశాలూ లేకపోలేదు. దీంతో హైకోర్టు తీసుకోబోయే నిర్ణయం ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన పార్టీకి, అలాగే కూటమి ప్రభుత్వానికీ కీలకంగా మారబోతోంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు ఉపసంహరించుకోవడం వెనుక కారణాల్నీ కూటమి సర్కార్ హైకోర్టులో సమర్థించుకోవాల్సి ఉంటుంది. ఇందులో విఫలమైతే ఈ కేసు తదుపరి విచారణకు హైకోర్టు అనుమతించే అవకాశం కూడా లేకపోలేదు.