HYDERABAD:హైదరాబాద్ రూపురేఖలు మార్చే రీజినల్ రింగ్ రైల్వే లైన్ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఊతమిచ్చే హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు వెంబడి రీజినల్ రింగ్ రైల్వే లైన్ ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా ఉండడంతో దీనిపై వడివడిగా అడుగులు పడుతున్నాయి.
ఆర్ఆర్ఆర్ వెంబడి రైల్వే లైను ఏర్పాటుకు కృషి
ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులను కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రీజినల్ రింగ్ రైల్వే లైన్ రాష్ట్రానికి ఎంతో అవసరమని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆర్ఆర్ఆర్ వెంబడి రైల్వే లైను ఏర్పాటు చేస్తే రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందని ఆయన పేర్కొనగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ ప్రాజెక్టుకు మద్దతు తెలిపారు.
రీజినల్ రింగ్ రైల్వే లైన్ ఏర్పాటుకు రైల్వే జీఎంకు ఆదేశం
దీంతో ఇటీవల హైదరాబాద్లో పర్యటించిన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ రీజినల్ రింగ్ రైల్వే లైన్ ఏర్పాటుకు ప్రక్రియను వేగవంతం చేయాలని రైల్వే జీఎం ను ఆదేశించారు. దాదాపు 400 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ ఉండడంతో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో పారిశ్రామికంగా, ఆర్థికంగా ప్రగతి జరుగుతుందని భావిస్తున్నారు.
రీజినల్ రింగ్ రైల్వే లైన్ కోసం అధికారుల కసరత్తు
ఆర్ఆర్ ఆర్ వెంబడి రీజనల్ రింగ్ రైల్వే లైన్ ఏర్పాటు చేసేలాగా చూడాలని రైల్వే శాఖ మంత్రి ఆదేశాలతో రైల్వే జిఎం, రాష్ట్ర రవాణా, ఆర్ అండ్ బి శాఖాధికారులతో రెండుసార్లు ఇప్పటికే సమావేశమయ్యారు. ఆర్ఆర్ఆర్ ప్రతిపాదనలు రవాణా మార్గం గురించి పూర్తి వివరాలను సేకరించి రైల్వే లైన్ ఏర్పాటు చేయడానికి అవసరమైన భూసేకరణ ఏమిటి? సాంకేతిక సమస్యలు ఏమిటి? అనే అంశాలపైన చర్చలు జరిపారు.
సమగ్రంగా పరిశీలిస్తున్న రైల్వే అధికారులు
ఆర్ ఆర్ ఆర్ పక్కన రైల్వే లైన్ ఏర్పాటు సాధ్యం అవుతుందా కాదా అన్న అంశం పైన అధ్యయనం చేస్తున్న అధికారులు రైల్వే లైను ఏర్పాటు జరిగితే ఎంత భూమి అవసరమవుతుంది? ఎన్ని మీటర్ల వరకు భూసేకరణ చేయాలి? ఎక్కడెక్కడ రైల్వే స్టేషన్లను నిర్మించాలి? ఎక్కడ లైన్ల అనుసంధానం, జంక్షన్లు ఏర్పాటు చేయాలి అనేది సమగ్రంగా పరిశీలిస్తున్నారు.
భూసేకరణతో పాటు ఇతర అంశాలపై క్లారిటీ
మళ్ళీ త్వరలో మరోమారు అధికారులందరూ సమావేశం నిర్వహించి భూసేకరణ తో పాటు ఇతర అంశాల పైన ఒక క్లారిటీ కి వచ్చే అవకాశం ఉంది. ఆర్ఆర్ఆర్ ఉత్తరభాగం కోసం 100 మీటర్ల వెడల్పుతో భూమిని సేకరించాలని, దక్షిణ భాగంలో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. రింగు రైలు లైన్ కోసం కనీసం 50 మీటర్ల వెడల్పుతో ఉత్తర దక్షిణ భాగాలలో భూసేకరణ అవసరమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
రీజినల్ రింగ్ రోడ్డు, రైల్వే లైను ఏర్పాటయితే ఆ ప్రాంత అభివృద్ధి
రైల్వే లైను ఏర్పాటు చేస్తే ఉత్పన్నమయ్యే సాంకేతిక సమస్యలు, వాటిని ఏ విధంగా అధిగమించాలి అన్న దానిపైన అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఏది ఏమైనా రీజనల్ రింగ్ రైల్వే లైన్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆసక్తి చూపిస్తున్న క్రమంలో ఈ నిర్మాణం పూర్తయితే రీజినల్ రింగ్ రోడ్డు, రైల్వే లైను పరిసర ప్రాంతాల అభివృద్ధి చెంది ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు.
Social Plugin