INDIA:దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాల జాతర కొనసాగుతోంది. ప్రభుత్వాలు ఒకరిని మించి మరొకరికి పథకాలు ఇచ్చేందుకు కొత్త దారులు వెతుక్కుంటున్నాయి. తద్వారా వారి ఓట్లను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో మహిళలకు ఉద్దేశించిన పలు పథకాలు ఇప్పుడు అమలవుతున్నాయి. ఇలా ఓ మహిళల పథకం డబ్బుల్ని పురుషులు అక్రమంగా కొట్టేసిన ఘటన తాజాగా చోటు చేసుకుంది.
మహారాష్ట్రలో ప్రభుత్వం గత ఎన్నికలకు ముందు మహిళల కోసం లడ్కీ బహిన్ పథకం తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో 21-65 ఏళ్ల మహిళలకు నెలకు 1500 చొప్పున ఇస్తున్నారు. కుటుంబ వార్షికాదాయం 2.5 లక్షల కంటే తక్కువ ఉన్న వారికి మాత్రమే ఈ పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకం మహారాష్ట్రలోని అధికార మహాయుతి సర్కార్ కు మంచి పేరు తీసుకొచ్చింది. దీంతో గత ఎన్నికల్లో మరోసారి ఆ కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే ఈ పథకం మహిళలకు ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలుసుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన తనిఖీల్లో ఓ సంచలన విషయం బయటపడింది.
మహారాష్ట్రలో మహిళలకు ఉద్దేశించిన ఈ లడ్కీ బహిన్ పథకం డబ్బుల్ని ఏకంగా 14 వేల మందికి పైగా పురుషులు అక్రమంగా వాడుకుంటున్నట్లు ప్రభుత్వ తనిఖీల్లో తేలింది. సాఫ్ట్ పేర్ లో మార్పులు చేసి మహిళలుగా తమ పేర్లు ఎంటర్ చేయించుకుని ఇలా వీరంతా నెలకు 1500 రూపాయల చొప్పున గత కొన్ని నెలలుగా కొట్టేస్తున్నట్లు అధికారులు తేల్చారు. ఇలా మొత్తం రూ.21.44 కోట్లు అక్రమంగా దండుకున్నట్లు నిర్ధారించారు. దీంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది.
మహారాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ నిర్వహించిన ఆడిట్‌లో 14,298 మంది పురుషులకు రూ.21.44 కోట్లు చెల్లించినట్లు తేలింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వ్యవస్థను తారుమారు చేసి వారు మహిళా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారని, పథకం ప్రారంభించిన దాదాపు 10 నెలల తర్వాత ఈ దుర్వినియోగం వెలుగులోకి వచ్చినట్లు తేలింది. దీంతో ఇప్పుడు సదరు 14 వేల మంది పురుషుల నుంచి ఈ డబ్బులు రికవరీ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే ఈ పథకంలో అనర్హులు భారీగా నమోదయ్యారని, వీరి వల్ల రూ.1640 కోట్లు నష్టపోయినట్లు ప్రభుత్వం చెబుతోంది.
Social Plugin