Hot Posts

6/recent/ticker-posts

ఆ పుకారు వల్లే హరిద్వార్ మానసాదేవి ఆలయ తొక్కిసలాట.. సీఎం ఏమన్నారంటే


INDIA:ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. హరిద్వార్ నగరంలో కొలువై ఉన్న ప్రసిద్ధ మానసా దేవి ఆలయంలో నేడు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మానసా దేవి ఆలయంలో ఊహించని విధంగా ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందగా, 25 మందికి పైగా గాయాలపాలయ్యారు.

మానసా దేవి ఆలయం వద్ద తొక్కిసలాట

క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని మానస దేవి ఆలయంలోఆలయానికి వెళ్లే మార్గంలో భక్తులు ఒక్కసారిగా ముందుకు రావడంతో తొక్కిసలాట సంభవించిందని సమాచారం. ఆలయంలో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉన్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనతో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, ఆలయ పరిసరాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

ఆ పుకారే తొక్కిసలాటకు కారణం

ఆలయంలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి అన్న పుకారు చెలరేగడంతో భక్తులు ఒక్కసారిగా కంగారుకి గురయ్యారు. ఉదయం ఎనిమిది గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఓవర్ హెడ్ విద్యుత్ లైన్ తెగిపోయి నడక దారిలో రద్దీగా ఉండే భాగంలో పడిందని పెద్ద ఎత్తున పుకారు చెలరేగింది. ఇది యాత్రికులను ఒక్కసారిగా భయాందోళనకు కారణమైంది. కొందరు భక్తులు ఈ వార్త తెలియగానే వెనక్కి వెళ్లే ప్రయత్నం చేయగా తొక్కిసలాట మరింత తీవ్రమైంది.

25 మందికి గాయాలు కాగా ఆరుగురు మృతి

చాలామంది అక్కడ ఊపిరాడక స్పృహ తప్పి కింద పడిపోయారు. ఈ ఘటనలో మొత్తం 25 మందికి గాయాలు కాగా ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే ఆలయ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని మానసా దేవి ఆలయం గంగానది సమీపంలో ఒక కొండపైన ఉంటుంది. ఇక్కడ కొలువై ఉన్న నాగదేవతను భక్తులు తమ కోరికలను తీర్చే కల్పవల్లిగా భావించి పూజిస్తారు.

స్పందించిన ఉత్తరాఖండ్ సీఎం

అయితే కొండపై ఉన్న ఈ ఆలయం వద్దకు చేరుకోవడానికి మెట్ల మార్గం తో పాటు రోప్వే కూడా ఉంది చాలామంది భక్తులు రోప్వే ద్వారానే ఆలయానికి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే ఈ క్రమంలో మానస దేవి ఆలయానికి వెళ్లిన భక్తులు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే ఈ ఘటన పైన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర విచారణ వ్యక్తం చేశారు.

తొక్కిసలాట వార్త కలచివేసిందన్న ఉత్తరాఖండ్ సీఎం

హరిద్వార్ లోని మానస దేవి ఆలయానికి వెళ్లే మార్గంలో తొక్కిసలాట జరిగిందన్న వార్త తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన పేర్కొన్నారు ఉత్తరాఖండ్ ఎస్ డి ఆర్ ఎఫ్, స్థానిక పోలీసులు, ఇతర రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్నాయి. ఈ విషయం పైన ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నాను అని ఉత్తరాఖండ్ సీఎం తెలిపారు. భక్తులంతా భద్రంగా ఉండాలని తాను అమ్మవారిని కోరుకుంటున్నానని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర సింగ్ ధామీ తెలిపారు.