ANDHRAPRADESH:ఏపీలో త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందనే వార్తలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి. వచ్చే నెల అంటే ఆగస్టులోనే ఈ మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని తేదీతో సహా ప్రచారంలో ఉంది.అయితే ఈ వార్తలను టీడీపీ ఖండించింది. అలాంటి ఆలోచనే లేదని కూడా తన అధికారిక ఫ్యాక్ట్ చెక్ ఎక్స్ హ్యాండిల్‌లో స్పష్టం చేసింది. ఈ స్పష్టత ఇచ్చినప్పటికీ కూడా ఇంకా మంత్రి వర్గ విస్తరణ వార్తలకు మాత్రం బ్రేక్ పడలేదు. టీడీపీ ముఖ్యనేతలు మాత్రం మంత్రి వర్గ విస్తరణ ఉందని తమ సన్నిహితుల దగ్గర చెబుతున్నారట. ఇందులో భాగంగానే కొందరు నేతలు కూడా కేబినెట్‌లో చోటు కోసం తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే సీఎం చంద్రబాబు మనసులో మాత్రం ఈ సారి సీనియర్లకు చోటివ్వాలనే ఆలోచన ఉన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి వర్గ విస్తరణ జరిగితే చంద్రబాబు సీనియర్లకు చోటు ఇవ్వాలని భావిస్తున్నారు. చంద్రబాబు కేబినెట్‌లో ముగ్గురు నుంచి ఆరుగురిపై వేటు పడే అవకాశం ఉన్నందున... ఇప్పటికే పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నందున సీనియర్లు తమకు ఈ బెర్తు దక్కుతుందనే ఆశతో ఉన్నారు.ఆ మేరకు ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. అయితే వీరినెవరినీ కాదని చంద్రబాబు ఎవరైతే జగన్‌కు సరైన కౌంటర్ ఇస్తారో... పార్టీకి వీరవిధేయుడిగా ఉంటారో అలాంటి సీనియర్‌కు అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు మదికి ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేరు తట్టిందని పార్టీలోని పలువురు చర్చించుకుంటున్నారు.
అయ్యన్న పాత్రుడే ఎందుకు..?
ప్రస్తుతం ఉన్న మంత్రులెవరూ జగన్‌ను కార్నర్ చేయలేకపోతున్నారనే ఫీలింగ్ పార్టీ అధిష్టానంలో ఉందట. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అయ్యనపాత్రుడిని అప్పటి వైసీపీ సర్కార్ ఇబ్బందులు పెట్టినప్పటికీ వాటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొని జగన్ ప్రభుత్వంపై అయ్యన్న పాత్రుడు విరుచుకుపడిన తీరు నాడు రెండు తెలుగు రాష్ట్రాలు చూశాయి. అప్పట్లో అయ్యన్న పాత్రుడి పేరు మారుమోగిపోయింది. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అయ్యన్న పాత్రుడికి మంత్రి పదవి తప్పకుండా వస్తుందని భావించారు. అయితే అనూహ్యంగా ఆయనకు స్పీకర్ పదవి ఇస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీంతో మాటలతో తూటాలు పేల్చే అయ్యన్న పాత్రుడి నోరును కట్టేసినట్టయ్యింది.
ఉదాహరణకు జగన్ కార్ టైర్ కింద పడి ఒక వ్యక్తి చనిపోయిన కూడా మంత్రులు ఎవ్వరూ కూడా అనుకున్న విధంగా స్పందించలేదు, అదే అయ్యన్న రాజ్యాంగబద్ధ పదవి లో వున్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే తన గొంతుని గట్టిగా వినిపించేవాడు అని కార్యకర్తలు అందరి నుంచి వచ్చే సమాధానం. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఉత్తరాంధ్ర నేత అవసరం చంద్రబాబుకు తప్పనిసరైందని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఒకవేళ మంత్రివర్గ విస్తరణ ఉంటే అయ్యన్న పాత్రుడిని కేబినెట్‌లోకి చంద్రబాబు తీసుకుంటారనే వార్త టీడీపీ పొలిటికల్ సర్కిల్స్‌లో షికారు చేస్తోంది.
క్యాడర్‌లో ధైర్యం నింపేందుకు..
ఇక అయ్యన్న పాత్రుడు టీడీపీ సైనికుడిలా ఎలాంటి పోరాటపటిమ కనబర్చారో అందరికీ తెలిసిందే.తనను వైసీపీ సర్కార్ ఇబ్బంది పెట్టిన సమయంలో పార్టీ క్యాడర్ నిరుత్సాహానికి గురికాగా వారిలో ధైర్యం నింపేందుకు ఏనాడు బయటకు రాని తన భార్యను తీసుకొచ్చి వార్డు మెంబర్‌గా నిలబెట్టాడంటే ఆయన తెగింపు ఏమిటో అర్థమవుతోందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.అలాంటి రాజీ లేని పోరాటం చేసిన నాయకులూ ఉంటే కార్యకర్తల్లో స్ఫూర్తి, ఉత్సహాన్ని నింపగలరు అనే ఉద్దేశంతో మంత్రి పదవికి ఎంపిక చేసే అవకాశాలున్నాయని అనలిస్టులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇవన్నీ పరిశీలించిన మీదట ఒకవేళ మంత్రి వర్గ విస్తరణ జరిగితే అయ్యన్న పాత్రుడిదే ఫస్ట్ ఛాయిస్ ఉంటుంది, ఉండాలనేది టీడీపీ నాయకులు కార్యకర్తలు కోరుకుంటున్నారు. చంద్రబాబు కూడా సీనియర్లకు ప్రాతినిథ్యం కల్పించాలనే కృతనిశ్చయంతో ఉన్నారు కాబట్టి, అయ్యన్న పాత్రుడిని తన కేబినెట్‌లోకి తీసుకునే అవకాశాలెక్కువున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పరిశీలకులు.
Social Plugin