Hot Posts

6/recent/ticker-posts

అమరావతి లో మారుతున్న లెక్కలు - ఏం జరుగుతోంది..!!


AMRAVATHI:ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. 2024 ఎన్నికల ఫలితాల్లో రాజధాని అంశం డిసైడిండ్ ఫ్యాక్టర్ గా నిలిచింది. కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తరువాత అమరావతిలో కదలిక వచ్చింది. పనులు ప్రారంభం అయ్యాయి. కాగా, రెండో విడత భూ సమీకరణ అంశం మొత్తంగా సమీకరణాలపైనే ప్రభావం పడింది. ఇప్పటికీ సీఆర్డీఏ ఈ అంశం పైన స్పష్టత ఇవ్వటం లేదు. అటు జగన్ రాజధాని పైన ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. సమీకరణ పై పవన్ అభిప్రాయం పైన చర్చ జరుగుతోంది.

కీలక పరిణామాలు

అమరావతి కేంద్రంగా ఆసక్తి కర పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాలను మూడేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. టెండర్లు పిలిచి పనులు అప్పగించింది. మాజీ సీఎం జగన్ మూడు రాజధానులు అంటూ అమరావతిని పూర్తిగా విస్మరించారు. ఫలితంగా ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు అమరావతి వ్యతిరేక వ్యాఖ్యలు ఏ మాత్రం చేయటం లేదు. అమరావతి నిర్మాణంలో ఖరారు చేస్తున్న ధరల పైన ప్రశ్నించారు. అడుగు నిర్మాణానికి ఇంత ఖర్చు ఎక్కడైనా ఉందా అని వ్యాఖ్యానించారు. కాగా, రాజధాని విస్తరణ కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన రెండో విడత భూ సమీకరణ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కనిపించని ఆనందం

అమరావతి భూ సమీకరణ పైన రైతుల్లో ఏకాభిప్రాయం లేదు. సీఆర్డీఏ నిర్వహించిన గ్రామ సభల్లో పలువురు రైతులు అభ్యంతరం వ్యక్తం చేసారు. రాజధాని కేంద్రంగా చోటు చేసుకుంటున్న పరిణా మాల పైన డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. మంత్రివర్గ భేటీలో రెండో విడత భూ సమీకరణ పైన పునరాలోచన చేయాలని సూచించినట్లు సమాచారం. తాజాగా పవన్ ఇచ్చిన ఇంటర్వ్యూల్లో నూ అక్కడ ఇతరులకు గందరగోళం చేసేందుకు... ప్రభుత్వాన్ని విమర్శించేందుకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే తన సూచన చేసానని చెప్పుకొచ్చారు. రాజధానిలో చోటు చేసుకొంటు న్న పరిణామాలను వైసీపీ నిశితంగా గమనిస్తోంది. తాజాగా రాజధాని రైతులకు కౌలు డబ్బులు అందించింది. అయినా రైతుల్లో ఎక్కడా ఆనందం కనిపించటం లేదు.

ఏం చేయబోతున్నారు

రాజధాని కోసం భూములిచ్చిన 29,498 మంది రైతుల్లో 23,384 మందికి మాత్రమే కౌలు పొందేందుకు అర్హులుగా ఉన్నారు. అయితే, వారికి కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కౌలు చెల్లించ లేదు. 18,638మందికి మాత్రమే కౌలు చెల్లించింది. అయితే, కొందరి బ్యాంకు ఖాతాల్లో కోడ్ తప్పుగా ఉండటంతో నగదు జమ కాలేదని మంత్రి నారాయణ చెబుతున్నారు. భూములు ఇచ్చిన రైతులకు ఏటా పది శాతం పెంచాల్సి ఉంది. ఈ క్రమంలో కౌలు మొత్తం పెరుగుతూ వచ్చింది. అయితే, ఈ పదేళ్లలో రైతుల సంఖ్య తగ్గింది. 29,498 గా ఉండాల్సిన రైతుల సంఖ్య ఇప్పుడు 23,384 కి పడిపోయింది. ఇక.. రెండో విడత సమీకరణ పైన సీఆర్డీఏ నుంచి స్పష్టత రావటం లేదు. ప్రస్తుత సింగపూర్ పర్యటన ద్వారా రాజధానిలో తిరిగి వారి భాగస్వామ్యం ఏంటనేది స్పష్టత రానుంది. మొత్తంగా.. అమరావతిలో మాత్రం ప్రస్తుత పరిణామాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.